ఆదర్శిని పేరు కాదు.. ప్రతీక | abandoned newborn baby gets new life as adarshini | Sakshi
Sakshi News home page

ఆదర్శిని పేరు కాదు.. ప్రతీక

May 30 2026 7:32 AM | Updated on May 30 2026 7:52 AM

abandoned newborn baby gets new life as adarshini

సిరిసిల్ల టౌన్‌: గత ఏప్రిల్‌ 23న రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌ టాయిలెట్స్‌లో ఓ కఠిన దృశ్యం ఆవిష్కృతమైంది. పుట్టి రెండు గంటలు కూడా గడవకముందే, ఏ తప్పు ఎరుగని ఒక పసిగుడ్డును కన్నతల్లే వదిలించుకుని వెళ్లిపోయింది. పేగుబంధాన్ని తెంచుకుని విసిరేసిన ఆ పసిప్రాణాన్ని స్థానికులు గుర్తించి, పోలీస్, జిల్లా సంక్షేమ శాఖాధికారులకు సమాచారం అందించారు. ఆ క్షణం నుంచే ఆ బిడ్డకు మానవత్వం రక్షగా నిలిచింది. వెంటనే చిన్నారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల వేట కోసం పోలీసు కేసు నమోదైనా ఎలాంటి ఆధారాలు లభించలేదు. 

కానీ, ఆస్పత్రి సిబ్బంది, సఖీ టీం సభ్యులు ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. వారి సంరక్షణలో... నాడు కేవలం 1500 గ్రాముల అత్యల్ప బరువుతో చావుబతుకుల మధ్య ఉన్న ఆ పాప, నేడు 2700 గ్రాముల బరువుతో సంపూర్ణ ఆరోగ్య వంతురాలైంది. డీడబ్ల్యూవో లక్ష్మీరాజం ఆదేశాలతో శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వేళ.. సీడబ్ల్యూసీ, మిషన్‌ వాత్సల్య, హాస్పిటల్‌ సిబ్బంది అంతా కలిసి ఆ చిన్నారిని తమ బిడ్డగా భావించి ఘనంగా బారసాల చేశారు. ఊయల ఊపి, ఆ పసిదానికి ‘ఆదర్శిని’అని నామకరణం చేసి, శిశుగృహకు తరలించారు. 

ఆదర్శిని ఇది పేరు మాత్రమే కాదు..
మనలో మిగిలున్న మానవత్వానికి ప్రతీక కూడా..   

Advertisement
 
Advertisement
Advertisement