ప్రభుత్వ స్కూళ్లలో వసతుల కల్పనకు రూ.7289 కోట్లు

7289 crores for construction of facilities in government schools - Sakshi

మొదటి దశలో 35శాతం నిధులతో మే 15కి పనులు పూర్తి 

ప్రతి ప్రభుత్వ స్కూల్‌ని కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతాం 

హైదరాబాద్‌లో విద్య ఖర్చుతో కూడుకుంది 

అందుకే సీఎం కేసీఆర్‌ ‘మన బస్తీ–మన బడి’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు 

ప్రధానోపాధ్యాయుల సమీక్షలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ 

హిమాయత్‌నగర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు మూడు దశల్లో రూ.7289 కోట్లు నిధులు ఖర్చు చేస్తున్నట్టు పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ వెల్లడించారు. మొదటి దశలో 239 పాఠశాలల్లో  35శాతం నిధులను ఖర్చు చేసి మే 15వ తేదీలోపు వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన బస్తీ–మన బడి’ కార్యక్రమం అమలులో భాగంగా శనివారం నారాయణగూడలోని కేశవ మెమోరియల్‌ విద్యాసంస్థల్లో ప్రధానోపాధ్యాయులతో మంత్రి తలసాని అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు.

హోంమంత్రి మహముద్‌ అలీ, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటే ష్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ సురభివాణిదేవి, టీఎస్‌డబ్ల్యూఈఐసీడీ చైర్మన్‌ రావుల శ్రీధర్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్‌ దేవసేన, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి  , జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకే ష్కుమార్‌ హాజరయ్యారు. సమీక్ష అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు.

కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల విచ్చలవిడి ఫీజుల వల్ల ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో విద్య ఎంతో ఖర్చుతో కూడుకున్నదిగా మారిందని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో పేదలకు భారంగా ఉన్న విద్యను సులభతరం చేసేందుకు, ప్రైవేటు విద్య కంటే నాణ్యమైన, విలువైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్‌  ‘మన బస్తీ–మన బడి’కి శ్రీకారం చుట్టారని తెలిపారు. ముందుగా బడులను బాగు చేసి అన్ని వర్గాల వారికి ప్రభుత్వ బడులపై నమ్మకం, విశ్వాసం కలిగించడమే సీఎం ఉద్దేశమన్నారు. 

స్కూళ్లల్లో కరెంటు కట్‌ చేయొద్దు 
స్కూలు గేటు మొదలు ప్రహరీ గోడ, స్కూల్లో ఫర్నీచర్, మంచినీటి సదుపాయం, మూత్రశాలలు ఇలా ప్రతి ఒక్క సౌకర్యంపై దృష్టి సారిస్తామని తలసాని తెలిపారు. కరెంట్‌ బకాయిలు కారణంగా ఏఒక్క ప్రభుత్వ స్కూల్లో కరెంట్‌ కట్‌ అవడానికి వీలు లేదన్నారు.

విద్యుత్‌ శాఖ, విద్యాశాఖ రెండూ ప్రభుత్వ శాఖలే కాబట్టి..ఈ రెండు శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలే గానీ కరెంట్‌ సరఫరా నిలుపుదల చేయకూడదన్నారు. ఈ విషయంలో విద్యాశాఖ కార్యదర్శి, కమిషనర్, డీఈఓలు అవసరమైతే నేరుగా విద్యుత్‌ శాఖ అధికారులతో మాట్లాడాలని మంత్రి సూచించారు. 

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top