కుక్క కాటుతో బాలుని మృతి | 7 year old boy dies following a dog bite At Jogulamba Gadwal District | Sakshi
Sakshi News home page

కుక్క కాటుతో బాలుని మృతి

May 22 2026 12:18 AM | Updated on May 22 2026 12:18 AM

7 year old boy dies following a dog bite At Jogulamba Gadwal District

అలంపూర్‌ రూరల్‌: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ మండల పరిధిలో ఓ బాలుడు కుక్కకాటుతో మృతి చెందాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. కోనేరు గ్రామానికి చెందిన బిచ్చాల స్వాములు, తిమ్మలమ్మకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. స్వాములు ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏప్రిల్‌ 25న కుమారుడు జీవన్‌బాబు (7), చిన్నకుమార్తె మణి ఇంటి పరిసరాల్లో ఆడుకుంటుండగా.. ఓ పిచ్చి కుక్క  ఇద్దరిపై దాడి చేసింది.

జీవన్‌ తలతో పాటు శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చిన్నారులిద్దరికీ వైద్యం చేయించారు. యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ సైతం ఇప్పించారు. అయితే ఈ నెల 16వ తేదీన బాలునికి జ్వరం రావడంతో స్థానికంగా ఉండే వైద్యుడి దగ్గరికి వెళ్లి చికిత్స చేయించారు. ఈనెల 18వ తేదీన జీవన్‌ ఆరోగ్యం క్షీణించడంతో పాటు కాలు, చెయ్యి కదలిక లేకపోవడం, పక్షవాతం మాదిరిగా రావడంతో వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బాలుడు గురువారం మృతి చెందాడు.

కుక్క దాడిలో ఇద్దరికి గాయాలు 
కోనరావుపేట(వేములవాడ):  రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లిలో గురు వారం రాత్రి కుక్కదాడిలో ఇద్దరు అన్నదమ్ములకు గాయాలయ్యాయి. గ్రామంలోని బుడగజంగాల కాలనీకి చెందిన చిత్తారి బాలయ్య–అనిత దంపతుల కుమారులు చిత్తారి రాజేశ్‌ (10), చిత్తారి అజయ్‌ (6) ఇంటివద్ద ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో కుక్క ఇద్దరిపై దాడి చేసింది. గాయపడిన ఇద్దరిని కోనరావుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యసేవలు అందించారు. గ్రామంలో వారం రోజుల క్రితం లోకుర్తి నిశాంత్‌ అనే ఐదో తరగతి బాలుడు పిచ్చి కుక్క కరిచి మృతి చెందడం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement