
ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరగాలంటే రాష్ట్ర పోలీసులతో పాటు సాయుధ దళాల బందోబస్తు కూడా ఎంతో ముఖ్యం. ఆ సాయుధ బలగాల ఓట్లు కూడా అంతే ముఖ్యంగా అభ్యర్థులు భావిస్తున్నారు. అందుకే సర్విస్ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో అభ్యర్థులు వారిని ఆకర్షించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. ఇక ఈ ఎన్నికలలో మెజారిటీ సర్వీస్ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపిస్తారోనన్న చర్చ కూడా సాగుతోంది.
అత్యధికంగా నిర్మల్ జిల్లాలో...
రాష్ట్రవ్యాప్తంగా 15,406 మంది సర్విస్ ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 930 మంది, అత్యల్పంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 98 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. గ్రామీణ నియోజకవర్గాలలో వందల సంఖ్యలో సర్విస్ ఓటర్లు ఉండగా.. అర్బన్ నియోజకవర్గాలలో 10 కంటే తక్కువ మంది ఓటర్లు ఉండటం గమనార్హం.
అత్యల్ప సర్వీస్ ఓటర్లు గ్రేటర్‌లోనే..
హైదరాబాద్‌లో 404 మంది, రంగారెడ్డి జిల్లాలో 592, మేడ్చల్ జిల్లాలో 732 మంది సర్వీస్ ఓటర్లున్నారు. రాష్ట్రంలో అత్యల్ప సర్వీస్ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. బహదూర్‌పుర, చార్మినార్, మలక్‌పేటలో ఒక్కో నియోజకవర్గాలలో కేవలం 9 మంది సర్విస్ ఓటర్లు ఉండగా.. సనత్‌నగర్, గోషామహల్ సెగ్మెంట్లలో 10 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు.
సర్విస్ ఓటర్లు ఎవరంటే..
భారత సాయుధ దళాలు, అస్సాం రైఫిల్స్ పారామిలటరీ దళం, సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీఎఫ్, జీఆర్‌ఈఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉద్యోగులను సర్విస్ ఓటర్లుగా పరిగణిస్తారు. వీళ్లు పోస్టల్ బ్యాలెట్ లేదా ప్రాక్సీ ఓట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.
ఓటు ఎలా వేస్తారంటే..
సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ఆఫీసర్ సర్విస్ ఓటరుకు పోస్టల్ బ్యాలెట్ పంపిస్తారు. ఒకవేళ సర్విస్ ఓటరు విదేశాల్లో ఉంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా పంపిస్తారు. ఆ పేపర్ మీద మీకు నచ్ఛిన అభ్యర్థి పేరుకు ఎదురుగా స్పష్టమైన గుర్తును ఉంచితే ఓటు వేసినట్టు. ఒకవేళ వీరు సూచించిన గుర్తు స్పష్టంగా కనిపించకపోయినా, బ్యాలెట్ పేపర్ మీద సంతకం లేదా ఏదైనా పదాలు రాసినా ఓటు చెల్లదు. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపరుతో పంపిన ‘ఏ’ గుర్తు ఉన్న చిన్న కవర్‌లో పెట్టి, సీల్ చేసి, రిటర్నింగ్అధికారికి పోస్టులో పంపించాలి.
మహిళ సర్విస్ ఓటరైతే..
ఉద్యోగరీత్యా ప్రస్తుతం వేరే చోట నివాసం ఉంటున్నప్పటికీ సర్విస్ ఓటర్లు వారి స్థానిక నియోజకవర్గంలో ఓటు వేయవచ్చు. ఒకవేళ కుటుంబంతో సహా కలిసి పోస్టింగ్ చేస్తున్న ప్రాంతంలోనే నివసిస్తే గనక అక్కడే సాధారణ ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. అయితే సర్వీస్ ఓటర్లుగా నమోదు చేసుకునే కుటుంబ సభ్యుల అర్హత ప్రమాణాలలో ఆసక్తికరమైన అంశం ఒకటుంది. సాధారణంగా సర్విస్ ఓటరు భార్య, కుటుంబ సభ్యులు కూడా సంబంధిత నియోజకవర్గంలో సర్విస్ ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. అయితే ఒకవేళ సర్విస్ ఓటరు గనక మహిళ అయితే మాత్రం భర్తకు ఈ నిబంధన వర్తించదు.