ఎల్లుండే ‘లోక్‌సభ’ కౌంటింగ్‌ | The process of votes counting starts on 4th at 8 am | Sakshi
Sakshi News home page

ఎల్లుండే ‘లోక్‌సభ’ కౌంటింగ్‌

Published Sun, Jun 2 2024 4:47 AM | Last Updated on Sun, Jun 2 2024 4:47 AM

The process of votes counting starts on 4th at 8 am

4వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రక్రియ ప్రారంభం 

తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు.. తర్వాత ఈవీఎంలో ఓట్ల లెక్కింపు.. 

34 ప్రాంతాల్లో 120 కౌంటింగ్‌ కేంద్రాలు.. 10 వేల మంది సిబ్బంది 

వివరాలు వెల్లడించిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 10వేల మంది సిబ్బందిని ఎంపిక చేసినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. 4న జరిగే లోక్‌సభ ఓట్ల లెక్కింపుతోపాటు 2న జరిగే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు, 5న జరిగే ఉమ్మడి నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్ల ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 120 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని వికాస్‌రాజ్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 10 వేల మంది సిబ్బందిని ఎంపిక చేశామని.. ఇందులో 50 శాతం సిబ్బంది రిజర్వ్‌లో ఉంటారని చెప్పారు. ర్యాండమైజేషన్‌ పద్దతిలో సిబ్బందిని ఎంపిక చేసి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు వివరించారు. 

మూడంచెల భద్రత మధ్య 
ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి ఒక కౌంటింగ్‌ కేంద్రం ఉంటుందని.. ఒక కేంద్రంలో 24 టేబుల్స్‌ ఉంటాయని వికాస్‌రాజ్‌ తెలిపారు. అయితే మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో 28 టేబుల్స్‌ అవసరమవడంతో.. రెండు హాల్స్‌ ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతి కౌంటింగ్‌ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని.. గుర్తింపు కార్డు ఉంటేనే కేంద్రం లోపలికి అనుమతిస్తామని తెలిపారు. 

కౌంటింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, కెమెరాలు సహా ఎలాంటి ఎల్రక్టానిక్‌ పరికరాలను అనుమతించబోమన్నారు. ఇప్పటివరకు 2.18 లక్షల పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చాయని.. ఇంకా ఈటీపీబీఎస్‌ (ఎ ల్రక్టానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సిస్టం)లు వస్తున్నాయని, కౌంటింగ్‌ రోజు ఉదయం 8 గంటలలోపు వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ లెక్కన పోస్టల్‌ బ్యాలెట్ల సంఖ్యపై కౌంటింగ్‌ రోజే స్పష్టత వస్తుందన్నారు.  

చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధికి సంబంధించి ఓట్ల లెక్కింపునకు 24 రౌండ్లు పడుతుందని.. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట సెగ్మెంట్లకు సంబంధించి 13 రౌండ్లలోనే పూర్తవుతుందని వివరించారు. సీఈసీ ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో ర్యాండమ్‌గా ఐదు పోలింగ్‌ కేంద్రాల్లోని వీవీ ప్యాట్‌ రసీదులను లెక్కిస్తామని తెలిపారు. 

2,414 మంది సూక్ష్మ పరిశీలకులు
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కోసం 2,414 మంది సూక్ష్మ పరిశీలకులను (మైక్రో అబ్జర్వర్లను) నియమించినట్టు వికాస్‌రాజ్‌ తెలిపారు. ఒక్కో టేబుల్‌కు ఒక అబ్జర్వర్‌ ఉంటారని చెప్పారు. లెక్కింపు కోసం ఒక టేబుల్‌కు ఒక ఏఆర్‌ఓ, ఇద్దరు సహాయకులు ఉంటారన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్లకు సంబంధించి ముందుగానే సమాచారం ఇవ్వా ల్సి ఉంటుందని చెప్పారు. స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి లెక్కింపు కేంద్రం వరకు బారికేడ్లు, పటిష్ట భద్రత మధ్య తరలిస్తామని.. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందని వివరించారు. 

కౌంటింగ్‌ రోజు మద్యం దుకాణాలను మూసివేస్తామన్నారు. ఆ రోజున ర్యాలీలకు అనుమతి ఉండదని తెలిపారు. ఒకవేళ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు అనుమతిస్తే ర్యాలీలు చేసుకోవచ్చన్నారు. ఎప్పటికప్పుడు పరిశీలకుల అను మతి తర్వాత ఫలితాలు వెల్లడిస్తారని.. కౌంటింగ్‌ హాల్‌లో, మీడియా సెంటర్‌ వద్ద ప్రకటిస్తామని, వెబ్‌సైట్‌లోనూ అప్‌లోడ్‌ చేస్తా మని తెలిపారు. 

ఆదివారం జరిగే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అక్కడి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో జరుగుతుందని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ దుప్పలపల్లిలోని తెలంగాణ వేర్‌హౌజ్‌ కార్పొరేషన్‌ గోదాం ఆవరణలో జరుగుతుందని వికాస్‌రాజ్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement