రక్తమోడిన రహదారులు | 12 Dead in Separate Road Accidents in Telangana | Sakshi
Sakshi News home page

రక్తమోడిన రహదారులు

May 26 2026 1:30 AM | Updated on May 26 2026 1:30 AM

12 Dead in Separate Road Accidents in Telangana

రాష్ట్రంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 12 మంది మృతి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరుగురు, ఉమ్మడి వరంగల్‌లో ఐదుగురు, కుమురంభీం జిల్లాలో ఒకరు మృత్యువాత

సాక్షి నెట్‌వర్క్‌: ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లో రహదారులు రక్తమోడాయి. ఈ ఉమ్మడి జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇందులో ఉమ్మడి నల్లగొండ ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, ఉమ్మడి వరంగల్‌లో ఐదుగురు మృత్యువాత పడ్డారు.  నేపాల్‌కు చెందిన మీనాబుల్‌ (21), రవీబుల్‌ (28) యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఓ బేకరీలో పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి వారిద్దరూ బైక్‌పై ఆలేరు నుంచి జనగామ వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.

మరో ఘటనలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని తండ్రి, కుమార్తె మృతి చెందారు. వెంకట్రాంపురం గ్రామానికి చెందిన కీత రాజయ్య(65)కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సోమవారం రాజయ్య రెండో కుమార్తె సునీత (43)తో కలిసి మునగాలలోని బ్యాంక్‌కు వచ్చి స్వగ్రామానికి వెళ్తుండగా మొద్దుల చెరువు గ్రామ స్టేజీ వద్దకు రాగానే గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సునీతను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

సూర్యాపేట జిల్లాలోనే మోతె మండలం రాఘవాపురం క్రాస్‌ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఖమ్మం పట్టణంలోని ద్వారకానగర్‌కు చెందిన రామిశెట్టి వెంకటరమణమ్మ (63), రామిశెట్టి వెంకాయమ్మ (70) కొన్నిరోజుల క్రితం హైదరాబాద్‌లోని తమ బంధువుల వద్దకు వెళ్లారు. 

సోమవారం బంధువుల అబ్బాయితో కలిసి కారులో తిరిగి ఖమ్మంకు వెళ్తుండగా.. మార్గమధ్యలో రాఘవాపురం క్రాస్‌ రోడ్డు వద్దకు రాగానే.. పక్కన ఆగి ఉన్న లారీ ఒక్కసారిగా రోడ్డు మీదకు రావడంతో వెనుక వస్తున్న కారు దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. వెంకాయమ్మను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది.  

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో..  
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్‌ నల్ల సిద్దినర్సమ్మ, మల్లయ్యల కుమారుడు వెంకటేశ్‌ (24) సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బైక్‌పై జనగామ నుంచి బసిరెడ్డిపల్లికి వస్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటేశ్‌ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే చనిపోయాడు. మరో ప్రమాదంలో జయశంకర్‌ భూ పాలపల్లి జిల్లా కాటారం నుంచి ధర్మసాగర్‌ వైపు వెళ్తున్న కారు గుమ్మళ్లపల్లి శివారులోకి రాగానే అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి చెట్టును బలంగా ఢీకొట్టింది.

కారులో ప్రయాణిస్తున్న శ్రావణ్‌(22) మృతిచెందగా శశివరణ్, రాజుకుమార్‌ల కు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లెకి చెందిన బొక్కల ఐలయ్య (75) సోమవారం తెల్లవారు జామున జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం గురిజాలకు చెందిన మచ్చిక సాయికుమార్‌ (25) ఆదివారం మేడారం వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. మరో ఘటనలో వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలో సోమవారం రాత్రి నడుచుకుంటూ వెళుతున్న మద్ది సాంబయ్య (36)ను ద్విచక్రవాహనం ఢీకొనడంతో మృతిచెందాడు.  

కారు ఢీకొని హెడ్‌కానిస్టేబుల్‌ మృతి 
కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ జాడి బాపురావు (59) సోమవారం మధ్యాహ్నం డ్యూటీ ముగియడంతో ఇంటికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. కొద్ది దూరం వెళ్లగానే పులికుంట వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో బాపురావు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement