
సాక్షి, వేములవాడ(రాజన్న సిరిసిల్ల): చిరుప్రాయంలోనే పలు రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న ఈ చిన్నారి పేరు గద్దె శ్రేష్ట. వేములవాడకు చెందిన ఈ చిన్నారి ఓవైపు శాస్త్రీయ నృత్యం, మరోవైపు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ కనబరుస్తూ ప్రశంసలు అందుకుంటోంది. వీటికి తోడు హస్తకళాకృతులను తయారు చేస్తూ తన సృజనాత్మకతను చాటుకుంటోంది. 2010 మే 17న జన్మించిన శ్రేష్ట ఉన్నత చదువుల కోసం ప్రస్తుతం కరీంనగర్‌లో తన తల్లిదండ్రులు స్వప్న–శ్రీవర్ధన్ వద్ద ఉంటోంది. నాలుగేళ్ల వయస్సులోనే టీవీలో వచ్చే వివిధ డ్యాన్స్ షోలను చూస్తూ అలవోకగా స్టెప్పులు వేయడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమె అభిరుచికి అనుగుణంగా కరీంనగర్‌లోనే చొప్పరి జయశ్రీ వద్ద డ్యాన్స్ నేర్పించడంతో పాటు మార్షల్ ఆర్ట్స్’లో శిక్షణ ఇప్పించారు.
ఇప్పటికే 20 వరకు నృత్య ప్రదర్శనలు ఇచ్చిన ఆమె మార్షల్ ఆర్ట్స్‌లో ఆరెంజ్ బెల్ట్ సాధించి, పలు రాష్ట్రీయ, జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంది. లాక్‌డౌన్‌లో సమయాన్ని వృథా చేసుకోకుండా వ్యర్థ పదార్థాలతో అర్థవంతమైన ఆకృతులను తయారు చేస్తూ తనలోని సృజనాత్మకతను చాటుకుంటున్న శ్రేష్ట మరింత రాణించాలని కోరుకుందాం.