న్యూస్‌రీల్
17 ఏళ్ల అనంతరం వేడుక
భక్త జన సంద్రమైన ఆధ్యాత్మిక నగరం
అనుమతి దక్కక పలువురి అవస్థలు
మంత్రులపై ఆగ్రహం
ఆధ్యాత్మిక నగరం మధురై గురువారం
భక్త జన సంద్రంలో పులకించింది. ఎటు చూసినా మీనాక్షి సుందరేశ్వరులను కీర్తిస్తూ నామస్మరణలు మార్మోగాయి. 17 ఏళ్ల అనంతరం అత్యంత వేడుకగా 12 గోపురాలతో నిండిన మీనాక్షి సుందరేశ్వరుల సన్నిధిలో కుంభాభిషేకం కనుల పండువగా సాగింది.
సాక్షి, చైన్నె : ప్రపంచ ప్రసిద్ధి చెందిన మధురై మీనాక్షి సుందరేశ్వరర్ ఆలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం మహా సంప్రోక్షణ 12 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. చివరిసారిగా 2009 ఏప్రిల్ 8న కుంభాభిషేకం జరిగింది. ఆ తర్వాత 2018లో వీరవసంతరాయర్ మండపంలో జరిగిన అగ్నిప్రమాదం, ఇతర పునరుద్ధరణ పనుల కారణంగా ఈ వేడుక ఆలస్యమైంది. రూ.35 కోట్లతో వీరవసంతరాయర్ మండప పునరుద్ధరణ పూర్తవ్వడం, రూ.28 కోట్లతో 12 గోపురాల ఆధునీకరణ, రంగులు వేయడం శిల్పాల పనులు పూర్తి కావడంతో గురువారం ఈ ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ మహోత్సవ వేళ ఉదయం సరిగ్గా 7:35 గంటలకు రాజగోపురాలు, అమ్మవారు, స్వామివారి బంగారు విమానాలపై పవిత్ర జలాలను సంప్రోక్షించి కుంభాభిషేకం జరిపించారు. ఈ మహోత్సవం నిమిత్తం సెప్టెంబర్ 11 నుంచి ఉత్తరాడి వీధిలో 184 కుండాలతో యాగశాల పూజలు ప్రారంభమయ్యాయి. బుధవారం పరివార దైవాలన్నింటికీ కుంభాభిషేకం పూర్తి చేశారు. తాజాగా ఉదయం 7.50 గంటలకు మూలవర్ మీనాక్షి అమ్మవారికి, 8 గంటలకు మూలవర్ సుందరేశ్వరర్ స్వామికి కుంభాభిషేకం నిర్వహించారు. ఆలయ పైభాగంలో భద్రతా కారణాల దృష్ట్యా కేవలం 3 వేల మంది దాతలతోపాటుగా 11 వేల మందిని మాత్రమే అనుమతించారు. ఈ పవిత్ర వేడుకలో రాష్ట్ర మంత్రులు, మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం న్యాయమూర్తులు, ధర్మపురం ఆదీనం తదితర ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు తరలి వచ్చి దైవదర్శనం చేసుకున్నారు. గంగా, కావేరి తదితర పవిత్ర నగదుల నుంచి తీసుకొచ్చి జలాలతో కుంభాభిషేకం ఘట్టాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ సమయంలో ఆ నీటిని భక్తులపై చల్లారు. కుంభాభిషేకం సమయంలో భక్తులు మీనాక్షి సుందరేశ్వరుల్ని స్మరిస్తూ ప్రార్థనలు చేశారు.
విజయవంతంగా వేడుక
అమ్మవారి ఆలయ కుంభాభిషేకాన్ని విజయవంతంగా నిర్వహించామని దేవాదాయ శాఖ మంత్రి రమేష్ ధీమా వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి పరిపాలన ఏ పాటి తెలుసంటూ గత పాలకుల చేసిన విమర్శలను పక్కనపెట్టి, సీఎం మార్గదర్శకాల మేరకు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయ కుంభాభిషేక వేడుకను అత్యంత విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఆలయం ఎదురుగా ఉన్న పుదుమండపంలో ఇంధన శాఖ మంత్రి నిర్మల్ కుమార్‌తో కలిసి మంత్రి రమేష్ విలేకరులతో మాట్లాడారు. మూడు నెలల ముందే అమ్మవారి ఆలయ కుంభాభిషేకంపై సమీక్షా సమావేశం నిర్వహించి, వీరవసంతరాయర్ మండప పనులను వేగవంతం చేయాలని ఆదేశించామన్నారు.. ఆలయ పైభాగంలో 9,500 మందికి మించి కూర్చునే అవకాశం లేనందున, నిబంధనల ప్రకారమే పాస్‌లు జారీ చేశామన్నారు. ఇందులో 2,000 మంది సాధారణ ప్రజలతో పాటు, ఆలయానికి రూ.25 కోట్లు విరాళం అందించిన దాతలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులకు ఎలాంటి వివక్ష లేకుండా పాస్‌లు అందించామన్నారు. ఉదయం 10 గంటలకే సాధారణ దర్శనాలకు అనుమతిస్తామని చెప్పినప్పటికీ, భక్తుల సౌకర్యార్థం ఉదయం 8.30 గంటలకే దర్శనానికి అనుమతించామన్నారు. వేడుకకు వచ్చిన సుమారు 2.5 లక్షల మంది భక్తులకు తాగునీరు, బిస్కట్లు ఉన్న ప్యాకెట్లను అందజేశామన్నారు. భక్తుల భద్రత కోసం తాము కింద నుంచే కుంభాభిషేకం వీక్షించామని, ప్రత్యేక దర్శనానికి కూడా వెళ్ల లేదన్నారు. కొన్ని ప్రాంతాల్లో భక్తులు గుమిగూడడంతో స్వల్ప రద్దీ ఏర్పడిందని, ఆ సమయంలో తాము స్వయంగా భక్తులతో మాట్లాడి ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా దర్శనం చేసుకునేలా తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. భక్తులందరూ ఓపికగా సహకరించార న్నారు. ఆలయం లోపల ఉన్న భక్తులపై డ్రోన్ల ద్వారా తీర్థం చల్లడం సాధ్యం కానందున, వీధుల్లోకి వచ్చే భక్తులపై డ్రోన్ల ద్వారా పవిత్ర తీర్థాన్ని చల్లుతున్నట్లు ఆయన వివరించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం వలన ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని తెలిపారు.
డ్రోన్ ద్వారా పర్యవేక్షణ
కనుల పండువగా మీనాక్షి అమ్మవారి
ఆలయ కుంభాభిషేకం
అనుమతి దక్కక అవస్థలు
కుంభాభిషేకం వేళ అడుగడుగున వివాదాలు, ఆగ్రహావేశాలు రగిలాయి. 17 ఏళ్ల తర్వాత జరిగిన ఈ మహాసంప్రోక్షణను కనులారా వీక్షించడానికి వచ్చిన భక్తులను పోలీసులు ఆలయ పరిసర వీధుల్లోకి అనుమతించకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో అటుగా వచ్చిన మంత్రి నిర్మల్ కుమార్ కారును భక్తులు అడ్డుకుని నిలదీశారు. ఈసారి భద్రతా కారణాల దృష్ట్యా, వీఐపీలు, దాతలు, లక్కీ డ్రాలో ఎంపికై న కొద్దిమంది భక్తులు మినహా సాధారణ ప్రజలను ఆలయ ప్రాంగణంలోకి, కనీసం ఆలయ పరిసరాలలోని వీధుల్లోకి కూడా అనుమతించలేదు. దీంతో ఆవణి మూలవీధి, మాసి వీధుల్లోనే వేలాదిగా భక్తులు గుమిగూడి దూరం నుంచే గోపురాలను దర్శించుకున్నారు. కుంభాభిషేకం ముగిసిన తరువాత ఆలయం నుండి బయటకు వస్తున్న రాష్ట్ర మంత్రి నిర్మల్ కుమార్ కారును భక్తులు చుట్టుముట్టారు. ‘‘కేవలం వీఐపీలు మాత్రమే ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించలేదు.. ప్రజలమైన మేమంతా ఓట్లు వేస్తేనే మీరు అధికారంలోకి వచ్చారు’’ అంటూ వారు తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నించారు. అయితే మంత్రి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. అదే సమయంలో కుంభాభిషేకం పూర్తయిన తర్వాత కూడా ఆలయం వైపుగా తమను అనుమతించక పోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. కనీసం పవిత్ర జలాల్ని అయినా, తమ మీద చల్లాలని కోరగా, బకెట్లలో తీసుకొచ్చి చల్లారు. అదే సమయంలో తమను అనుతించకపోవడంతో ఒక్క సారిగా భక్తులు ఆలయం వైపుగా దూసుకు రావడంతో తొక్కిసలాట అనేలా పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో అక్కడకు వచ్చిన మంత్రి నిర్మల్ కుమార్ పోలీసు టవర్ ఎక్కి మరీ ఉదయం 10 గంటల తర్వాతే అందరినీ లోపలికి అనుమతిస్తామని, అంతవరకు సంయమనం పాటించాలని కోరారు. దీనికి అంగీకరించని భక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ కుంభాభిషేక వేడుకను కళ్లారా చూసేందుకు ఎంతో దూరం నుండి అప్పులు చేసి మరీ వచ్చామని, అయితే, తమను గోపురాలను చూసేందుకు కూడా లోపలికి అనుమతించకపోవడం అత్యంత బాధాకరమని భక్తులు ఆవేదన వ్యక్తంచేశారు. కేవలం కార్లలో తిరిగే వీఐపీలు మాత్రమే మనుషులా? మమ్మల్ని అనుమతించరని ముందే చెబితే తాము ఈ ప్రాంతానికే వచ్చి ఉండేవాళ్లం కాదంటూ తీవ్ర నిరాశను వ్యక్తంచేశారు. అయితే, లక్షాది మంది వస్తారని చేపట్టిన భద్రత చర్యలు భక్తులకు ఇబ్బందులు కలిగించాయని మరి కొందరు వ్యాఖ్యానించారు. దూరం నుంచైనా కనులారా వీక్షించామని పేర్కొన్నారు. అయితే, ఆ పరిసరాలలో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయడమే కాకుండా, అన్ని ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం అందించేందుకు వీలుగా దేవాదాయ శాఖ వర్గాలే ప్రత్యేక ఏర్పాటు చేయడం గమనార్హం.


