సాక్షి, చైన్నె : రీల్స్ చేయడం, రీల్స్ వదలడమే టీవీకే ప్రభుత్వం సాధించిన అతిపెద్ద ఘనత అని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె. పళణి స్వామి విమర్శలు గుప్పించారు. మధురైలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
లండన్ పర్యటనపై అనుమానాలు
భారతదేశంలో సుమారు 32 ప్రాంతాలలో మదర్సన్ సంస్థ ఉందని, చైన్నెలోనూ దాని కార్యాలయం కూడా ఉందని పేర్కొంటూ, అలాంటప్పుడు సీఎం లండన్ వెళ్లి ఆ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక ఆవశ్యకత ఏమిటి? అని ప్రశ్నించారు. ఇది పరిశ్రమలను ఆకర్షించే పర్యటనా లేదా వినోద యాత్రా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శాసనసభ సమావేశాలలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిం దిపోయి, అధికార, ప్రధాన పక్షం పరస్పరం విమర్శలు చేసుకోవడంతోనే సమయం వృథా అయిందని, సినిమా సెట్టింగ్‌ను తలపించేలా అసెంబ్లీ సమావేశాలు మారాయని విమర్శించారు.
తీవ్రమైన విద్యుత్ కోతలు
రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కోతలు ఉన్నప్పటికీ, మంత్రులు మాత్రం కోతలే లేవని బుకాయిస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ కోత లేకపోతే, బహిరంగ మార్కెట్ నుండి 2వేల మెగావాట్ల విద్యుత్ ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. రాత్రి సమయాల్లో తరచూ విద్యుత్ కోతలతో ప్రజలు నిద్రలేమిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన కొద్దికాలంలోనే సుమారు రూ. 40 వేల కోట్ల అప్పు చేశారని, ఇందులో రూ. 36 వేల కోట్లు రెవెన్యూ ఖర్చులకే సరిపోయిందని వివరించారు. ఆర్థిక పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఇప్పుడే కొత్త సెక్రటేరియట్ నిర్మించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు.
శాంతిభద్రతలు అధ్వాన్నం
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రోజువారీగా హత్యలు, దోపిడీలు, చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నాయని ఆరోపించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి మరింత పెరిగిందని, రైతులు, వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్ల కోసం నిరంతరం ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు.


