పంచముఖ సమరం..! | - | Sakshi
Sakshi News home page

పంచముఖ సమరం..!

Sep 18 2026 1:39 AM | Updated on Sep 18 2026 1:39 AM

● ప్రధాన పక్షాల నామినేషన్ల ఆమోదం ● ప్రచార బాటలో నేతలు ● తనిఖీలు ముమ్మరం

సాక్షి, చైన్నె : మధురాంతకం, ధారాపురం ఉప ఎన్నికలలో పంచ ముఖ సమరం నెలకొంది. టీవీకే, డీఎంకే, అన్నాడీఎంకే, వామపక్షాలు, నామ్‌ తమిళర్‌ కట్చిల అభ్యర్థులు పోటీలో ఉన్నారు.వీరందరి నామినేషన్లు పరిశీలనలో గురువారం ఆమోదించారు. వివరాలు.. మధురాంతకం (ఎస్సీ) , ధారాపురం (ఎస్సీ) నియోజకవర్గాల ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం బుధవారం ముగిసిన విషయం తెలిసిందే. మధురాంతకంలో 48 నామినేషన్లు దాఖలయ్యాయి. ధారాపురంలో 51 నామినేషన్లు నమోదయ్యాయి. గురువారం పరిశీలనలో ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు అన్నీ ఆమోదించారు. స్వతంత్రులు కొందరివి తిరస్కరణకు గురి అయ్యాయి. శనివారం నామినేషన్ల ఉప సంహరణకు చివరి రోజు . ఆ తదుపరి ఎన్నికల రేసులో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. తాజాగా ఈ నియోజకవర్గాలలో పంచ ముఖ సమరం నెలకొంది. ఇందులో టీవీకే తరపున మధురాంతకంలో మరగతం కుమర వేల్‌, డీఎంకే తరపున పరంథామన్‌, అన్నాడీఎంకే తరపున కనిత సంపత్‌, సీపీఎం తరపున సుగంధి, నామ్‌ తమిళర్‌ కట్చి తరపున జానకీరామన్‌లు పోటీలో ఉన్నారు. ఇక, ధారపురంలో టీవీకే తరపున సత్యభామ, డీఎంకే అభ్యర్థిగా సుకన్య, అన్నాడీఎంకే అభ్యర్థిగా భానుమతి, నామ్‌ తమిళర్‌ కట్చి అభ్యర్థిగా కార్తిక, సీపీఐ అభ్యర్థిగా లక్ష్మణన్‌ పోటీ చేస్తున్నారు. ఈ ఐదు ప్రధాన పార్టీల మధ్య తాజాగా సమరం నెలకొనడంతో పోటీ రసవత్తరంగా మారింది.అదే సమయంలో ఈ నియోజకవర్గాలలో అత్యధికంగా ఉన్న వన్నియర్‌ సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌ ఎవరికి ఖాతాలో పడుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఆ సామాజిక వర్గానికి చెందిన పీఎంకే ఇంత వరకు ఎవరికి మద్దతు అన్న విషయాన్ని తేల్చలేదు. దీంతో పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి తమకే మద్దతు ఇస్తారని అన్నాడీఎంకే ఎదురు చూస్తోంది. టీవీకే వర్గాలు సైతం చాప కింద నీరులా మద్దతు ప్రయత్నాలలో ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా మధురాంతకంలోని పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ వీరప్పన్‌ తనిఖీ చేశారు. మధురాంతకం నియోజకవర్గంలో మొత్తం 167 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, వాటిలో 285 ఓటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పడాలం, మేలవళం ప్రాంతాలలో ఉన్న 8 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అలాగే ధారాపురంలో కలెక్టర్‌ నారనవేరి మనీష్‌ శంకరరావు సైతం ఎన్నికల కేంద్రాలు, కంట్రోల్‌ రూమ్‌లలో ఏర్పాట్లను పరిశీలించారు. ఇక వాహన తనిఖీ ముమ్మరంచేశారు. కాగా, తనిఖీలలో వెండి , తదితర వస్తువులను ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు సీజ్‌ చేస్తున్నాయి.

తట్టాన్‌చావడి 15 నామినేషన్లు ఆమోదం:

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని తట్టాన్‌చావడి నియోజకవర్గ ఉపఎన్నిక నామినేషన్ల పర్వంలో భాగంగా దాఖలైన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఈ పరిశీలనలో ఎన్‌.ఆర్‌. కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌పై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఎన్నికల అధికారులు నామినేషన్లను ఆమోదించారు. ఈ ఎన్నికల్లో ఎన్‌.ఆర్‌. కాంగ్రెస్‌ తరఫున అశోక్‌ ఆనంద్‌, కాంగ్రెస్‌– టీవీకే కూటమి తరఫున వినాయకం, డిఎంకే తరఫున సేతు సెల్వం, సిపిఐ తరఫున సలీం, నామ్‌ తమిళర్‌ కట్చి తరఫున కార్తీక్‌ కుమారి పోటీపడుతున్నారు. ఇక్కడ కూడా పంచముఖ సమరమే నెలకొంది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అర్జున్‌ రామకృష్ణన్‌ నేతత్వంలో నామినేషన్ల పరిశీలన ముగించారు. ఎన్‌.ఆర్‌. కాంగ్రెస్‌ అభ్యర్థి అశోక్‌ ఆనంద్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆయన విద్యా ట్రస్ట్‌ ఆదాయాన్ని కొన్ని సంవత్సరాలకు సున్నాగా చూపించడాన్ని కాంగ్రెస్‌ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే, ఆ కాలమ్‌ ఖాళీగా వదిలేయకుండా సంఖ్యను స్పష్టంగా పేర్కొన్నందున కాంగ్రెస్‌విజ్ఞప్తి ఎన్నికల అధికారి తోసిపుచ్చారు. అశోక్‌ ఆనంద్‌ నామినేషన్‌తో పాటు మొత్తం 15 నామినేషన్లూ సక్రమంగా ఉన్నట్లు గుర్తించి ఆమోదించారు. కాగా, ఈ అశోక్‌ఆనంద్‌ ఆస్తి రూ. 300 కోట్లుగా పేర్కొనడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement