వేలూరు: వేలూరు వీఐటీ యూనివర్సిటీలో శుక్రవారం నుంచి గ్రావిటాస్–26 ప్రారంభం కానున్నట్లు చాన్స్‌లర్ విశ్వనాథన్ తెలిపారు. ఈ మేరకు వేలూరు వీఐటీ యూనివర్సిటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఏటా వీఐటీలో గ్రావిటాస్ నిర్వహించి విద్యార్థుల మేధాశక్తిని వెలికి తీయడంతో పాటు పలు పరిశోధనలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు కళాజాత నిర్వహిస్తామన్నారు. కార్యక్రమ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా చైన్నెలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషన్‌కు చెందిన ఎండీ ఆలీముజ్జమాన్, హెచ్‌సీఎల్ టెక్‌లోని డిజిటల్ బిజినెస్ సర్వీసెస్ విభాగం గ్లోబుల్ హెడ్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ సవన్ వడపల్లి, అదే సంస్థలోని టాలెంట్ అక్విజిషన్ గ్లోబుల్ హెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రిన్స్ జయకుమార్ ప్రత్యేక ఆహ్యానితులుగా హాజరవుతారన్నారు. ఈ గ్రావిటాస్‌లో వీఐటీ యూనివర్శిటీకి దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్య ప్రతినిధులు, ఎన్‌ఐటీ, ఐఐటీ, ఐఐఎమ్‌ల వంటి మొత్తం 3 వేల యూనివర్సిటీలు, కళాశాలల నుంచి సుమారు 40 వేలకు పైగా విద్యార్థులు వీటిలో పాల్గొంటారన్నారు. అదే విధంగా ఈ సంవత్సరం 300 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు ఇందులో కలుసుకొని పరిశోధనలపై అవగాహణ పొందే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థుల బయో ఇంజినీరింగ్, రోబోటెక్స్, మెకానికల్, సివిల్, వ్యవసాయం వంటి 227 కార్యక్రమాలు జరపనున్నట్లు తెలిపారు. వీటిలో వందకు పైగా కార్యక్రమాలు టెక్నాలిజికి సంబందమైన వర్క్‌షాపులు, ప్రత్యేక సదస్సులు ఉంటుందన్నారు. ఈ సంవత్సరం 157 కొత్త కార్యక్రమాలు ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. వీటిలో 31 హ్యాకథాన్‌లు, 62 వర్క్‌షాప్‌లు, 57 సాంకేతిక పోటీలు, 10 పారిశ్రామిక వేత్తల నైపుణ్య కార్యక్రమాలు, 67 ఇతర కార్యక్రమాలు ఉంటాయన్నారు. గ్రావిటాస్–26 కార్యక్రమాల్లో జరిగే పోటీలకు విజయం సాధించిన కమిటీలకు వీఐటీ ఆధ్వర్యంలో రూ: 25 లక్షల నగదు రూ. 1.5 కోట్ల విలువైన బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.ముగింపు కార్యక్రమంలో వేడుకకు కాగ్నిజెంట్ గ్లోబుల్ హెడ్ ఆఫ్ టాలెంట్ ఆక్విజిషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సాగల్ ముఖ్య అథిదిగా హాజరవుతారన్నారు.


