తమిళసినిమా: కుటుంబం, స్నేహం, బరువు, బాధ్యతలు వంటి అంశాలతో రూపొందిన చిత్రం కోల్డ్ కాల్. సిద్దు మూలిమణి, సంతోష్, వైష్ణవ్ , కృష్ణ విజయ్ , బాలాజీ, శ్రీకాంత్, అమిత రంగనాథ, నిషా హెగ్డే, మారి లిటీ, కీర్తన పుల్కీ మొదలగు నూతన తారాగణం నటించిన ఈ చిత్రాన్ని వాక్ త్రోవ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేశవ్ మూర్తి నిర్మించారు. తంబి దురై కథ, కథనం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం ఒక మంచి ప్రయత్నం. వేర్వేరు ప్రాంతాలకు చెందిన నలుగురు యువకులు ఉద్యోగాన్ని వెతుక్కుంటూ సిటీకి చేరుకుంటారు. అలా ఒక సేల్స్ ప్రమోటింగ్ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తారు. ఆ తరువాత వారి మధ్య స్నేహం, కుటుంబ సమస్యలు వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం కోల్డ్ కాల్. పేదరికం, కుటుంబ అనుబంధాలు, మానవత్వం, అంతకు మించి వినోదం వంటి జనరంజకమైన అంశాలతో చక్కని సందేశాత్మక కథా చిత్రం కోల్డ్ కాల్. అయితే ఒక్కో సమస్యతో సిటీకి వెళ్లిన ఆ నలుగురు యువకులు జీవిత పయనం ఎలా సాగిందన్నదే ఈ చిత్రం. కాగా సినిమాపై ఆసక్తితో యాక్టింగ్ స్కూల్ నడుపుతున్న తాను మంచి చిత్రం చేయాలనే చిన్న ప్రయత్నం ఈ చిత్రం అని దర్శకుడు తంబి దురై పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని క్రౌడ్ ఫండ్‌తో రూపొందించినట్లు చెప్పారు. సరవణన్ ఛాయాగ్రహణం, ప్రణవ్ గిరిధర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. దీన్ని యాక్షన్ రియాక్షన్ సంస్థ అధినేత జెనీష్ విడుదల చేస్తున్నారు.


