తమిళసినిమా: నటుడు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం తరువాత మరో చిత్రం చేయలేదు. నూతన చిత్రానికి కథ, దర్శకుడు రెడీగా ఉన్నా షూటింగ్ ప్రారంభం కాలేదు. ఇందుకు కారణం అజిత్ కార్ రేస్‌లో పాల్గొనడంలో బిజీగా ఉండటమే. అదే సమయంలో తన కారు రేసు సన్నివేశాలను ఒక డాక్యుమెంటరీ చిత్రంగా రూపొందించారు. ఏఎల్.విజయ్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ చిత్రానికి గ్లాడియేటర్స్ అనే టైటిల్ ను నిర్ణయించారు. ఈ చిత్రం నవంబర్ నెలలో థియేటర్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ తన తాజా చిత్రంలో నటించడం సిద్ధం అవుతున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ నే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీనికి డేర్ డెవిల్ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. అంతేకాకుండా ఈ చిత్రం కోసం అజిత్ సతీమణి, నటి శాలిని నిర్మాతగా అవతారమెత్తుతున్నారు. బ్రేవ్ హార్ట్స్ పేరుతో బ్యానర్ ను ప్రారంభించారు. ఈ చిత్రం సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందా అని అజిత్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇందులో నటించే కథానాయకి ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్ కథా చిత్రంగా తెరకెక్కించనున్న ఈ చిత్రంలో అజిత్‌ను కొత్తగా, ఫ్రెష్ గా చూపించబోతున్నట్లు దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ ఇటీవల ఒక భేటీలో తెలిపారు. అంతే కాకుండా చిత్ర షూటింగ్‌ను నవంబర్ 2 తేదీన ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన అజిత్ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


