పెరియార్‌కు ఘన నివాళులు | - | Sakshi
Sakshi News home page

పెరియార్‌కు ఘన నివాళులు

Sep 18 2026 1:09 AM | Updated on Sep 18 2026 1:09 AM

● విజయపు తమిళనాడే లక్ష్యం: సీఎం విజయ్‌ ● ఆత్మగౌరవంతో నడచుకుందాం: ఎం.కె. స్టాలిన్‌

సాక్షి, చైన్నె: ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌జయంతిని గురువారం వాడ వాడలలో ఘనంగా నిర్వహించారు. సామాజిక న్యాయ దినోత్సవంగా ప్రభుత్వం నేతృత్వంలో కార్యక్రమాలు జరిగాయి. సచివాలయంలో పెరియార్‌ చిత్ర పటానికి సీఎం విజయ్‌ పుష్పాంలి ఘటించి, విజయపు తమిళనాడు లక్ష్యంగా ప్రతిజ్ఞ చేశారు. ఇక సమానత్వ లక్ష్యం వైపు సామాజిక న్యాయ మార్గంలో ఆత్మగౌరవంతో నడచుకుందాం అని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌ పెరియార్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం వ్యాఖ్యానించారు. వివరాలు.. ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌ జయంతి, సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా ఉదయం చైన్నె సింసన్‌ సమీపంలోని పెరియార్‌ విగ్రహానికి డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌ పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించారు. అనంతరం అన్నా అరివాలయంలో సామాజిక న్యాయ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు.‘‘తమిళుల తరాలు తలెత్తుకునేలా శ్రమించిన హేతువాద సూర్యుడు పెరియార్‌కు విప్లవాత్మక జోహార్లు. ఎన్నో తరాలు ఆధిపత్యానికి తలొగ్గాయి. ఒక తరం పెరియార్‌ తెచ్చిన విప్లవాన్ని చూసింది. రాబోయే తరాలు దాని మార్పును చూస్తున్నాయి. అయినప్పటికీ, ఆధిపత్యం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. దానిని గుర్తించాల్సిన బాధ్యత రాబోయే తరాల మీద కూడా ఉంది. వెలుతురు లేని చోట చీకటి ఉంటుంది, ప్రశ్నలు లేని సమాజం అంతకంటే పెద్ద చీకటి. ’ఎందుకు? దేనికి? ఎలా?’ అనే ప్రశ్నలు సజీవంగా ఉన్నంతవరకు చీకటి మనలను తాకదు. పెరియార్‌ వెలిగించిన హేతువాద జ్యోతి తరాలు దాటి ప్రకాశించాలి’’ అని పిలుపు నిచ్చారు.

విజయపు తమిళనాడును నిర్మిద్దాం

సీఎం విజయ్‌

పెరియార్‌ విగ్రహానికి సీఎం విజయ్‌ తరపున మంత్రులు ఆనంద్‌, ఆదవ్‌అర్జున, వన్నియరసు, మరియ విల్సన్‌, రాజ్‌ మోహన్‌, స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌ తదితరులు నివాళులర్పించారు. పెరియార్‌చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈసందర్భాన్ని పురస్కరించుకుని సీఎం విజయ్‌ సందేశం విడుదల చేశారు.తమిళ రాజకీయ రంగంలో అగ్రగామిగా నిలిచిన పెరియార్‌ జయంతి సందర్భంగా రాష్ట్ర హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ నివాళులర్పించారు. ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, హేతుబద్ధమైన ఆలోచనలను ప్రజల మనసులలో నాటి, కులమత భేదాలను రూపుమాపడానికి, ప్రజల హక్కులను సాధించుకోవడానికి జీవితాంతం పోరాడిన పెరియార్‌ జయంతి సందర్భంగా ఆయన విప్లవాత్మక ఆలోచనలను, సిద్ధాంతాలను గర్వంగా స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాను అని సీఎం విజయ్‌ పేర్కొన్నారు. పెరియార్‌ సిద్ధాంత బాటలో పయనిస్తూ, పుట్టుకతో అందరూ సమానులే అనే నినాదానికి అనుగుణంగా, సమాన అవకాశాలతో అందరూ అభివృద్ధి చెంది, ఆత్మగౌరవం ఉట్టిపడే తమిళనాడును నిర్మించడానికి ప్రతిజ్ఞ చేస్తున్నామని పిలుపు నిచ్చారు. పెరియార్‌ విత్తిన సామాజిక న్యాయ బీజాలు తరతరాలుగా వర్థిల్లు గాక అంటూ, విజయపు తమిళనాడును ఆవిష్కరించే ప్రయాణంలో ఆయన సిద్ధాంతాలే తనకు దిశా నిర్దేశం చేయాలన్నారు. అనంతరం వివిధ పార్టీల నేతలు పెరియార్‌విగ్రహం వద్ద అంజలి ఘటించారు. అలాగే వేప్పేరిలోని పెరియార్‌ దిడట్‌ వద్ద ద్రవిడ కళగం నేత వీరమణితో పాటూ నేతలు నివాళులర్పించారు. కాగా సాయంత్రం సచివాలయంలో పెరియార్‌కు నివాళుర్పించే కార్యక్రమం జరిగింది. సీఎం విజయ్‌ పాల్గొని పెరియార్‌ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. అలాగే సచివాలయం ఉద్యోగులతో సామాజిక న్యాయ దినోత్సవ ప్రతిజ్ఞను చేయించారు.

వేలూరులో..

వేలూరు : ద్రావిడ కయగం వ్యవస్థాపకుడు తందై పెరియార్‌ 148వ జయంతి వేడుకలను వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వేలూరు పాత కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ఉన్న తందై పెరియార్‌ విగ్రహానికి అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శి ఎస్‌ఆర్‌కే అప్పు అధ్యక్షతన కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకొని మాల వేసి నివాళులు అర్పించారు. డీఎంకే కార్యాలయంలోని తందై పెరియార్‌ చిత్ర పటానికి మాజీ ఎంపీ మహ్మద్‌ సఖీ అధ్యక్షతన నివాళులు అర్పించారు. కాట్పాడిలోని ధనభాగ్యం కల్యాణ మండపం సమీపంలోని పెరియార్‌ విగ్రహానికి టీవీకే పార్టీ జిల్లా కార్యదర్శి నవీన్‌ అధ్యక్షతన ఆ పార్టీ కార్యకర్తలు పూల మాల వేసి నివాళులు అర్పించారు. అదే విధంగా వేలూరు పార్లమెంట్‌ సభ్యులు కదీర్‌ ఆనంద్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌కుమార్‌, డివిజన్‌ కార్యదర్శి పరమశివంలతో పాటు డీఎంకే పార్టీ కార్యకర్తలు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా వేలూరు కలెక్టరేట్‌లో కార్యాలయ సిబ్బందిచే కలెక్టర్‌ లీల అలెక్స్‌ వివిధ శాఖల అధికారులచే ప్రతిజ్ఞ చేయించారు. అదే విధంగా తిరువణ్ణామలై, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాలోనూ పెరియార్‌ విగ్రహాలకు నాయకులు పూల మాల వేసి నివాళులు అర్పించి అనంతరం కార్యాలయ సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement