క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Sep 18 2026 1:09 AM | Updated on Sep 18 2026 1:09 AM

తండ్రిని నరికి చంపిన కొడుకు

ఆస్తిని విభజించలేదనే కోపంతో ఘాతుకం

అన్నానగర్‌: తురైయూర్‌ సమీపంలో ఆస్తిని విభజించడానికి నిరాకరించిన తన తండ్రిని కత్తితో నరికి చంపిన కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తిరుచి జిల్లా, తురైయూర్‌ సమీపంలోని తారచ్చిలోని అన్నా నగర్‌ ప్రాంతానికి చెందిన గణేషన్‌(75), రైతు. ఇతని భార్య బాప్పత్తి. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో, పెద్ద కుమారుడైన మణి(58), ఆస్తిలో తన వాటా విషయంలో తన తండ్రితో తరచుగా గొడవ పడుతూ వచ్చాడు. ఈ స్థితిలో, బుధవారం రాత్రి, ఎప్పటిలాగే, అతను ఆస్తి మొత్తం తనకే చెందుతుందని వాదిస్తూ తన తండ్రితో వాగ్వాదానికి దిగాడు. అప్పుడు, ఆవేశం తో తన చేతిలో ఉన్న కత్తితో తన తండ్రిని నరికాడు. ఇందులో గణేషన్‌ రక్తపు మడుగులో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న తురైయూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, మణిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

కోలాహలంగా

వినాయకుడి నిమజ్జనం

తిరువళ్లూరు: భారీ పోలీసు బందోబస్తు నడుమ వినాయకుడి నిమజ్జనం కోలాహలంగా ముగిసింది. ఏటా వినాయక చవితి వేడుకల తర్వాత మూడవ రోజు నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే గత సోమవారం వినాయచవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం బుధవారం సాయంత్రం ఏడుగంటలకు నిమజ్జనం ఊరేగింపుగా ప్రారంభమైంది. మొత్తం 169 విగ్రహాలను నిమజ్జనం చేశారు. స్థానిక ఆయిల్‌ మిల్‌ నుంచి ప్రారంభమైన నిమజ్జన ర్యాలీ కాకలూరు చెరువులో ముగిసింది. కాగా నిమజ్జనం సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు సైతం అంతరాయం లేకుండా ఒకే మార్గంలో రాకపోకలను సాగించారు. కాగా నిమజ్జనం సందర్బంగా బాణాసంచా, మంగళవాయిద్యం, కోలాట్టం, డాన్స్‌లు అందరిని ఆకట్టుకుంది. మొత్తానికి రాత్రి ఏడుగంటలకు ప్రారంభమైన నిమజ్జన ర్యాలీ రాత్రి రెండు గంటలకు ప్రశాంతంగా ముగిసింది.

అత్తను గొంతు నులిమి

చంపిన కోడలు

అన్నానగర్‌: చెంగల్పట్టులోని పెరియనాధం మెట్టు వీధికి చెందిన పెరుందేవి (61). ఈమె తన కుమారుడు వెంకటేషన్‌ (34), కోడలు ఇందుజ (28), మనవడు, మనవరాలితో నివసిస్తుంది. ఈ స్థితిలో, గత ఆదివారం సాయంత్రం పెరుందేవి తన ఇంట్లోని బాత్రూంలో జారిపడి తీవ్రంగా గాయపడి, స్పృహ కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఆమెను వెంటనే రక్షించి, తీవ్ర చికిత్స కోసం చెంగల్పట్టు ప్రభుత్వ వైద్య ఆసుపత్రిలో చేర్పించారు. ఈ స్థితిలో, సోమవారం పెరుందేవి విషాదకరంగా మరణించింది. చెంగల్పట్టు సిటీ పోలీస్‌ స్టేషన్‌లో సహజ మరణంగా కేసు నమోదు చేశారు. దీని అనంతరం, పెరుందేవి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా, ఆమె గొంతు నులమడం వల్ల మరణించినట్లు వెల్లడైంది. అనుమానం వచ్చిన పోలీసులు ఆమె కోడలు ఇందుజను విచారించారు. విచారణలో ఇందుజ చెప్పిన దాని ప్రకారం, గత ఐదేళ్లుగా అత్తాకోడళ్లు గొడవ పడుతు వచ్చారు. తన అత్త అకస్మాత్తుగా బాత్రూంలో స్పృహ కోల్పోవడాన్ని అవకాశంగా తీసుకుని, ఆమె గొంతు నొక్కి, కొట్టినట్లు తెలిపింది. చెంగల్పట్టు నగర పోలీసులు ఆమెను అరెస్టు చేసి, చెంగల్పట్టు క్రిమినల్‌ కోర్టులో హాజరుపరిచి, పుళల్‌ మహిళా జైలుకు తరలించారు.

సమయస్ఫూర్తితో

వ్యవహరించాలి : డీఎఫ్‌ఓ

తిరువళ్లూరు: విపత్తుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటూ సమయస్ఫూర్తిగా ఉంటూ సహాయక చర్యల్లో పాల్గొనాలని తిరువళ్లూరు జిల్లా అగ్నిమాపక అధికారి లోకనాథన్‌ సూచించారు. ఈశాన్య రుతుపవనాలు ద్వారా వరదలు వస్తే ప్రమాదంలో చిక్కుకునే వారిని రబ్బర్‌ ట్యూబ్‌, ధర్మకోల్‌, లారీ ట్యూబ్‌ తదితర వాటిని ఉపయోగించి ప్రజలకు సాయం ఎలా చేయాలన్న అంశపై అవగాహన కార్యక్రమం వీరరాఘవుని ఆలయ పుష్కరిణిలో జరిగింది. ఈ కార్యక్రమానికి డీఎఫ్‌ఓ లోకనాథన్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ విపత్తు సమయంలో ఇంటి వద్దే దొరికే చిన్నపాటి వస్తువులను ఉపయోగించి సహాయక చర్యలను చేపట్టాలని సూచించారు. దీంతో పాటు ప్రథమ చికిత్స అందించే అంశంపై సైతం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ విల్సన్‌రాజ్‌కుమార్‌, సెల్వరాజ్‌, స్టేషన్‌ అధికారులు ధనశేఖర్‌, పరశురామన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement