సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ప్రతిపక్షం అన్నాడీఎంకే సంక్షోభంలో మునిగిపోతుండగా, అధికార తమిళగ వెట్రి కళగం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ను స్పీడప్ చేసింది. అంబాసముద్రం నియోజకవర్గ అన్నాడీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఇసక్కి సుబ్బయ్య మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన సీఎం, సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీలో చేరారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్ తొలుత టైప్ చేసి ఇచ్చిన ఇసక్కి సుబ్బయ్య రాజీనామా లేఖను తిరస్కరించగా, వెంటనే ఆయన తన చేతిరాతతో రాసిన లేఖను సమర్పించారు. దీంతో స్పీకర్ ఆయన రాజీనామాను ఆమోదించారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసమే: ఇసక్కి సుబ్బయ్య
పార్టీ మారిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. 2021 నుంచి తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని గుర్తుచేశారు. ఆ సమయంలో తన నియోజకవర్గ ప్రజలకు పెద్దగా సంక్షేమ పథకాలను గానీ, నిధులను గానీ తీసుకురాలేకపోయాననని ఆవేదన వ్యక్తం చేశారు. తన అంబాసముద్రం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఏకై క లక్ష్యంతో, ప్రజల శ్రేయస్సు కోసమే నేను టీవీకేలో చేరానని ఆయన స్పష్టం చేశారు.
కోర్టుకు వెళ్తామన్న పళని వర్గం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తర్వాత, మే 13న జరిగిన విశ్వాస పరీక్షలో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి కె. పళనిస్వామి ఆదేశాలను ధిక్కరిస్తూ ఎస్.పి. వేలుమణి – సి.వి. షణ్ముగం నేతృత్వంలోని 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా ఓటేశారు. ఈ రెబెల్ వర్గంలో మంగళవారం రాజీనామా చేసిన ముగ్గురితో పాటుగా ఇసక్కి సుబ్బయ్య కూడా ఉన్నారు. మరోవైపు, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఈ రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వర్గం ఇప్పటికే స్పీకర్‌ను కోరింది. అనర్హత వేటు పడుతుందనే భయంతోనే వీరు వరుసగా రాజీనామాలు చేస్తున్నారని అన్నాడీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. రాజీనామా లేఖలను తక్షణం ఆమోదిస్తున్న స్పీకర్ నిర్ణయంపై తాము కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. తాజా పరిణామాలతో 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకే బలం 43కి పడిపోయింది.
మళ్లీ పార్టీ మారిన శరవణన్
తమిళనాడు రాజకీయాల్లో సీనియర్ నేత, ఎన్నికల వ్యూహకర్త డాక్టర్ శరవణన్ మరోసారి పార్టీ మారి సంచలనం సృష్టించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున మదురై నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మదురై మేయర్ పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన బుధవారం అన్నాడీఎంకేకు రాజీనామా చేశారు. అధికార తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరిపోయారు. రాష్ట్ర మంత్రి ఆనంద్ సమక్షంలో డాక్టర్ పి. శరవణన్ అధికారికంగా టీవీకే కండువా కప్పుకున్నారు. మదురై జిల్లాలో అన్నాడీఎంకే ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో మాజీ మంత్రి చెల్లూరు రాజుకు అత్యంత ఆప్తులుగా భావించే అన్నాడీఎంకే కీలక నేతలు కుమార్ (మదురై అర్బన్ ట్రెజరర్), పార్తీబన్, మారనాడు, జయపాండి ఇప్పటికే టీవీకేలో చేరగా..తాజాగా శరవణన్ కూడా వారి బాటలోనే ప్రయాణించారు. కాగా ఇప్పటికే డీఎంకే, బీజేపీ నేతలు ఆయన్ను వ్యంగ్యంగా ’సర్వ కట్చి శరవణన్’ (అన్ని పార్టీల శరవణన్) అని పిలుస్తుంటారు. ఆ మేరకు ఆయన పార్టీలను మార్చడంలో దిట్ట అన్న విషయం తెలిసిందే.
మంత్రుల సమక్షంలో టీవీకే తీర్థం
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే.. చైన్నె పనయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇసక్కి సుబ్బయ్య టీవీకే కండువా కప్పుకున్నారు. రాష్ట్ర మంత్రులు కె.ఎ. సెంగోట్టయన్, ఆనంద్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే అన్నాడీఎంకేకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామా చేసి టీవీకేలో చేరడం తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మంగళవారం మరగతం కుమరవేల్ (మదురాంతకం), ఎస్. జయకుమార్ (పెరుందురై), పి. సత్యభామ (ధరాపురం) తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఇసక్కి సుబ్బయ్య వంతు వచ్చినట్లయ్యింది. ఇప్పటికే సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి తూర్పు నియోజకవర్గంతో పాటుగా తాజాగా నాలుగు కలిపి మొత్తం ఐదు స్థానాలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నట్టు గెజిట్‌లో ప్రకటించారు.


