‘రెబెల్‌’ రాజీనామాలను ఆమోదించవద్దు! | - | Sakshi
Sakshi News home page

‘రెబెల్‌’ రాజీనామాలను ఆమోదించవద్దు!

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

● స్పీకర్‌కు పళని స్వామివర్గం వినతి ● మళ్లీ మాతృగూటికి పలువురు ఎమ్మెల్యేలు ● ఆపరేషన్‌ ఆకర్ష్‌పై వ్యతిరేకత

సాక్షి, చైన్నె : తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల లేఖలను ఆమోదించ వద్దని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన తరపున సీనియర్‌ నేతలు ఓఎస్‌మణియన్‌, అగ్రి కృష్ణమూర్తి, ఎంపి ఇన్బదురైలో స్పీకర్‌ జేసిడీ ప్రభాకర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

తప్పించుకునేందుకే రాజీనామాలు..

స్పీకర్‌ను కలిసిన అనంతరం అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి అగ్రి కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో పార్టీ విప్‌ను ధిక్కరించి, విజయ్‌ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసినందుకు గాను.. ఫిరాయింపుల నిరోధక చట్టంకింద అనర్హత వేటు వేయాలని తాము ఇప్పటికే స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని ఆయన గుర్తుచేశారు. తమ ఫిర్యాదు స్పీకర్‌ పరిశీలనలో ఉండగానే.. ఎక్కడ తమపై అనర్హత వేటు పడుతుందోననే భయంతోనే ఎమ్మెల్యేలు రాజీనామా డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హత వేటు పడకుండా తప్పించుకోవడానికి వారు ఇచ్చిన రాజీనామా లేఖలను స్పీకర్‌ ఆమోదించడం పూర్తిగా చట్టవిరుద్ధం, నియమ నిబంధనలకు విరుద్ధం. అందుకే వారి రాజీనామాలను తిరస్కరించాలని కోరినట్టు తెలిపారు.

ఇది సచివాలయమా? లేక టీవీకే కార్యాలయమా?

సచివాలయం వేదికగా జరిగిన పరిణామాలపై అన్నాడీఎంకే నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు ఇచ్చిన కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే.. సచివాలయంలోని పై అంతస్తులో ఉన్న ఒక మంత్రి ఛాంబర్‌లో వారికి టీవీకే పార్టీ మెంబర్‌షిప్‌ కార్డులు లభించాయని వారు ఆరోపించారు. అత్యంత వేగంగా కలర్‌ ప్రింట్‌ తీసి, లామినేట్‌ చేసిన గుర్తింపు కార్డులు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తూ ప్రస్తుతం నడుస్తున్నది ప్రభుత్వ సచివాలయమా లేక అధికార టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయమా? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో యథేచ్ఛగా ఎమ్మెల్యేల గుర్రపు బేరాల’కు దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కోర్టుకు వెళ్తాం: ఇంబదురై

అన్నాడీఎంకే లీగల్‌ వింగ్‌ నేత, ఎంపీ ఇన్బ బదురై మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు ఇప్పటికే గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైనప్పటికీ, దాన్ని వెనక్కి తీసుకునే సర్వాధికారాలు స్పీకర్‌కు ఉంటాయని స్పష్టం చేశారు. స్పీకర్‌ గనుక చట్టప్రకారం వ్యవహరించకుండా, పక్షపాత ధోరణి అవలంబిస్తే తాము ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

చట్టపరంగానే అన్ని నిర్ణయాలు: స్పీకర్‌ స్పష్టీకరణ

మరోవైపు, అన్నాడీఎంకే అభ్యంతరాలను పక్కనబెట్టి స్పీకర్‌ తాను చట్ట పరంగానే వెళ్తున్నట్టు స్పందించడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఇతర పార్టీల ఎమ్మెల్యేకు విజయ్‌ సర్కారు గాలం వేయడంపై వీసీకే నేత తిరుమావళవన్‌ స్పందిస్తూ, ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రభుత్వాన్ని చివరి వరకు రక్షించేందుకు వెన్నంటి ఉంటామన్నారు. ఇక, టీవీకే చర్యలను సీపీఎం నేత షణ్ముగం,సీపీఐ నేత వీర పాండియన్‌ ఖండించారు. అలాగే, టీవీకే సాగిస్తున్న ఈ బేరసారాలను అంగీకరించ లేమని, కూటమికి గుడ్డిగా మద్దతు ఇవ్వ కూడదంటూ కాంగ్రెస్‌ ఎంపీలు జ్యోతిమణి, మాణిక్యం ఠాకూర్‌ స్పందించడం గమనార్హం. ఇక అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి అయితే, తీవ్రస్థాయిలో సీఎం విజయ్‌ను, ఆయన పార్టీ వర్గాలను టార్గెట్‌ చేసి విరుచుకు పడ్డారు. ఎమ్మెల్యేలను కొనేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా తాజా పరిణామాల నేపథ్యంలో ఎస్పీవేలుమణి వెన్నంటి ఉన్నతిరుగుబాటు ఎమ్మెల్యేలు ఒకొక్కరుగా పళణి స్వామి వద్దకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు రాగా, మంగళవారం ఎమ్మెల్యే బాలకృష్ణారెడ్డి, సీనియర్‌ నేతలు నత్తం విశ్వనాతన్‌, తంగమణిలు పళనితో భేటీ కావడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement