జూన్‌ 4న పాఠశాలల పునఃప్రారంభం | - | Sakshi
Sakshi News home page

జూన్‌ 4న పాఠశాలల పునఃప్రారంభం

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

– ప్రభుత్వం నిర్ణయం

సాక్షి, చైన్నె: తమిళనాడులో పాఠశాలల పునఃప్రారంభం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ పెద్ద ఉపశమనం కలిగించింది. తీవ్రమైన ఎండల తీవ్రత కారణంగా రాష్ట్రంలో స్కూళ్ల రీఓపెనింగ్‌ను జూన్‌ 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తమిళనాడు పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో 2026–2027 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలల పునఃప్రారంభంపై విద్యాశాఖ గతంలో ఒక షెడ్యూల్‌ విడుదల చేసింది. దాని ప్రకారం.. 4వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు జూన్‌ 1వ తేదీన, అలాగే 1వ తరగతి నుంచి 3వ తరగతి చిన్నారి విద్యార్థులకు జూన్‌ 4వ తేదీన స్కూళ్లు తెరవాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్కూళ్ల సెలవులను పొడిగించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పలు సంఘాల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను, ప్రస్తుత వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ మంత్రి రాజమోహన్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి ఆదేశాల మేరకు విద్యాశాఖ తన పాత నిర్ణయాన్ని మారుస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

అన్ని స్కూళ్లకు ఒకే రోజే రీఓపెనింగ్‌

కొత్త ఉత్తర్వుల ప్రకారం.. తమిళనాడులోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌, మెట్రిక్యులేషన్‌ , ప్రైవేట్‌ పాఠశాలలు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ జూన్‌ 4వ తేదీన ఒకే రోజున పునఃప్రారంభం కానున్నాయి.పాఠశాలలు తెరిచేలోగా అన్ని విద్యాసంస్థల్లో మౌలిక వసతులను సిద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా ఎండల తీవ్రత దృష్ట్యా స్కూళ్లలో తాగునీటి సదుపాయం, తగిన ఆరోగ్య, పారిశుద్ధ్య వసతులు మరియు భద్రతా ఏర్పాట్లను ముందస్తుగానే తనిఖీ చేసి నిర్ధారించుకోవాలని స్పష్టం చేసింది. ఈ కొత్త విద్యాసంవత్సరం సజావుగా సాగడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు పూర్తిగా సహకరించాలని ప్రభుత్వం కోరింది.

Advertisement
 
Advertisement
Advertisement