వేలూరు:కన్నియంబాడి సమీపంలోని ఇటుకల బట్టీల యజమానుల వద్ద ప్రతి నెలా మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన టీవీకే కన్నియంబాడి యూనియన్ కార్యదర్శి విజయకుమార్‌ను పదవి నుంచి తొలగించడంతో పాటూ పార్టీ సభ్యత్వం నుంచి కూడా తొలగించారు. వివరాలు.. వేలూరు జిల్లా కన్నియంబాడి యూనియన్ కార్యదర్శి విజయమార్ ఈనెల 22వ తేదీన కన్నియంబాడి ప్రాంతంలోని ఇటుకల బట్టీల వద్దకు వెళ్లి ప్రతి నెలా రూ. లక్ష మామూళ్లు ఇవ్వాలని యజమానుల వద్ద డిమాండ్ చేసినట్లు తెలిసింది. దీనిపై యజమానులు, టీవీకే కార్యదర్శి మద్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వీటిపై ఇరు వర్గాల వారు వేలూరు తాలుకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఇటుకల బట్టీ ల యజమానులు, కూలీలు, స్థానికు లు టీవీకే కార్యదర్శి విజయకుమార్‌ను అరెస్ట్ చేయాలని కోరుతూ కన్నియంబాడి బస్టాండ్‌లో ఈనెల 25న రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ సెంథిల్‌కుమార్, పోలీసు లు స్థానికులతో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింప జేశారు. ఇదిలా ఉండగా విషయం తెలుసుకున్న టీవీకే జిల్లా కార్యదర్శి విజయమోహన్ టీవీకే పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కన్నియంబాడి యూనియన్ కార్యదర్శి విజయకుమార్‌ను పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


