మూడు భాషల భారం వద్దు | - | Sakshi
Sakshi News home page

మూడు భాషల భారం వద్దు

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

●కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించిన అన్నామలై

సాక్షి, చైన్నె: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని సీబీఎస్‌ఈ బోర్డు తీసుకున్న ఒక తాజా నిర్ణయంపై తమిళనాడులో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విద్యాసంవత్సరం (2026–27) నుంచే 9వ తరగతి విద్యార్థులకు మూడు భాషలను చదవడం తప్పనిసరి చేస్తూ జారీ చేసిన కొత్త ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్‌ మీడియా ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.

చెప్పింది ఒకటి..చేసేది మరొకటా!

‘గత ఏప్రిల్‌ 2026లో సీబీఎస్‌ఈ ఒక కీలక ప్రకటన చేసిందని గుర్తు చేశారు. దీని ప్రకారం.. 6వ తరగతి నుంచి విద్యార్థులకు మూడు భాషలు తప్పనిసరి అని, అందులో రెండు భారతీయ భాషలు అయి ఉండాలని పేర్కొన్నట్టు వివరించారు. భారతదేశంలోని విభిన్న సంస్క్కృతులు, భాషల పరిజ్ఞానం చిన్న వయసులోనే పిల్లలకు లభిస్తుందనే ఉద్దేశంతో నాడు ఆ నిర్ణయాన్ని స్వాగతించిన వారిలో తాను కూడా ఒకడినని పేర్కొన్నారు. ఇదే ప్రకటనలో 9వ తరగతి విద్యార్థులకు మూడో భాషను తప్పనిసరి చేసే విధానాన్ని ఇప్పటికిప్పుడు కాకుండా, మూడేళ్ల తర్వాత.. అంటే 2029–30 విద్యాసంవత్సరం నుంచి మాత్రమే అమలు చేస్తామని స్పష్టంగా చెప్పారని తెలిపారు. అయితే, తాజగా కేంద్రం మాటతప్పడం శోచనీయమన్నారు. సీబీఎస్‌ఈ అన్ని అనుబంధ పాఠశాలలకు పంపిన కొత్త అంతర్గత ఉత్తర్వుల్లో మాట మార్చిందని అన్నామలై ఆరోపించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఈ విద్యాసంవత్సరం (2026 జూలై 1) నుంచే 9వ తరగతి విద్యార్థులు మూడు భాషలను కచ్చితంగా చదవాలని, అందులో రెండు భారతీయ భాషలు ఉండాలని ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రం తీసుకున్న ఈ హఠాత్తు నిర్ణయం వల్ల ముఖ్యంగా తమిళనాడుకు చెందిన సీబీఎస్‌ఈ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారని అన్నామలై పేర్కొన్నారు ఇది అన్యాయమని, పిల్లలపై మానసిక ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ కొత్త ఉత్తర్వులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. గతంలో బోర్డు ప్రకటించిన విధంగానే.. 9వ తరగతిలో మూడు భాషల విధానాన్ని మూడేళ్ల తర్వాత, అంటే 2029–30 విద్యాసంవత్సరం నుంచే అమలు చేయాలని, అప్పటివరకు పాత పద్ధతినే కొనసాగించి విద్యార్థులకు ఊరటనివ్వాలని అన్నామలై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement