ఎమ్మెల్యేల రాజీనామాపై అసత్య ప్రచారం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల రాజీనామాపై అసత్య ప్రచారం

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

నాపై కోపంతోనే అబద్ధాలు వళ్లిస్తున్నారు

మంత్రి సెంగోట్టయన్‌ ఫైర్‌

సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వరుసగా తమ పదవులకు రాజీనామా చేసి అధికార తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరుతుండటంపై ఆ పార్టీ నేత ఎడప్పాడి కె. పళనిస్వామి చేసిన ఆరోపణలను రాష్ట్ర మంత్రి కె.ఎ. సెంగోట్టయన్‌ తిప్పికొట్టారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తానే దగ్గరుండి టీవీకేలో చేర్చుతున్నాననే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈపీఎస్‌ తనపై ఉన్న కోపంతోనే ఇలాంటి అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చైన్నె సచివాలయంలో మంత్రి సెంగోట్టయన్‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు.

సొంత నిర్ణయంతోనే రాజీనామాలు!

రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. ధన బలాన్ని ఓడించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ పరిపాలనా విధానాలను చూసి ఆకర్షితులయ్యే ఇతర పార్టీల నేతలు టీవీకేలో చేరుతున్నారన్నారు. తమ ప్రభుత్వంలో ఎవరూ గుర్రపు బేరాలకు పాల్పడలేదన్నారు.. అసలు ఈ రాష్ట్రంలో గుర్రపు బేరాలు ఎవరు చేశారనేది ఈ దేశ ప్రజలందరికీ బాగా తెలుసనని పేర్కొన్నారు. గతంలో డీఎంకే మద్దతుతో తానే ముఖ్యమంత్రిని అవుతానని ప్రగల్భాలు పలికిన నేత ఎవరో తెలుసుకుని, ఈ ప్రశ్న ఆయన్నే అడగండి అని ఈపీఎస్‌ను ఉద్దేశించి సెంగోట్టయన్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

దాట వేత : రాజీనామా చేసిన రెబెల్‌ ఎమ్మెల్యేలకు రాబోయే ఉపఎన్నికల్లో మళ్లీ టీవీకే తరఫున పోటీ చేసే అవకాశం ఇస్తారా? అన్న ప్రశ్నకు.. ‘మున్ముందు ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది‘ అని మంత్రి దాటవేశారు. చివరగా ఎడప్పాడి పళనిస్వామిపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. ‘అన్నాడీఎంకేను స్థాపించిన ఎంజీఆర్‌, పార్టీని కాపాడిన జయలలిత చిత్రాలు తనకు అవసరం లేదని, కేవలం తన ఫోటో ఉంటే చాలని పళనిస్వామి భావించారని మండి పడ్డారు. అలాంటి వ్యక్తికి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదు’ అని సెంగోట్టయన్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement