సాక్షి, చైన్నె : పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహం వేరని, వారి రాజకీయ నిర్ణయాలు, సిద్ధాంతాలు వేరని పుదుచ్చేరి హోంమంత్రి ఎన్. నమశ్శివాయం స్పష్టం చేశారు. సోమవారం ఆయన పుదుచ్చేరిలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, మంత్రివర్గ విస్తరణ, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే..
పుదుచ్చేరిలో మళ్లీ ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని ఇలాగే కొనసాగిస్తామని హామీ ఇస్తున్నామన్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రిని కలిశాననని పుదుచ్చేరి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారన్నారు. పుదుచ్చేరి పోలీసు రంగానికి రాష్ట్రపతి నుంచి ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు దక్కడం గర్వకారణమన్నారు. ఐఆర్బీఎన్ 2వ బెటాలియన్‌కు రాష్ట్రపతి ఆమోదం లభించిందని, దీనివల్ల 1,007 మంది స్థానిక యువతకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు.
త్వరలోనే మంత్రివర్గ విస్తరణ
ఎల్‌జేకే మంత్రి పదవి ఆశించడం వల్లే కేబినెట్ విస్తరణ ఆలస్యమవుతోందా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ‘అలాంటిదేమీ లేదన్నారు. తమ జాతీయ నాయకత్వం,సీఎం రంగస్వామితో కలిసి చర్చించి మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపు, నామినేటెడ్ ఎమ్మెల్యేల ఎంపికపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారన్నారు. రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అని వ్యాఖ్యానించారు. తమిళనాడు రాజకీయాలపై మాట్లాడుతూ.. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ నేతృత్వంలోని టీవీకే 107 స్థానాలను కై వసం చేసుకోవడం గొప్పవిషయం అని, డీఎంకే మిత్ర పక్షాల మద్దతుతో అధికార పీఠాన్ని చేజిక్కించుకు రావాల్సినపరిస్థితి రావడం శోచనీయమన్నారు. టీవీకే పార్టీ తీసుకునే నిర్ణయాలు, వారి పనితీరుపైనే వారి భవిష్యత్తు విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. పొరుగు రాష్ట్రాలతో ఎప్పుడూ స్నేహపూర్వకంగా ఉండాలనే తమ సీఎం భావిస్తారన్నారు. సీఎం రంగసామితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, బీజేపీ అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటానని పేర్కొన్నారు. వారు కేటాయించే శాఖను తీసుకుంటానని, తట్టాంచావిడి ఉపఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి భారీ విజయం సాధిస్తారన్నారు. పుదుచ్చేరి సీఎం రంగసామి, తమిళనాడు సీఎం విజయ్ మిత్రులైనప్పటికీ.. వారి రాజకీయ పంథాలు వేరని స్పష్టం చేశారు.
నమశ్శివాయం
టీవీకే ఓట్ల శాతంపై విశ్లేషణ
ఇటీవలి ఎన్నికలి ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. పుదుచ్చేరిలోని మొత్తం 30 నియోజకవర్గాల్లో పోటీ చేసిన తమిళగ వెట్రి కళగం 17 శాతం ఓట్లను సాధించిందన్నారు. అదే సమయంలో కేవలం 10 స్థానాల్లో మాత్రమే పోటీ చేసిన బీజేపీ 12 శాతం ఓట్లను రాబట్టిందన్నారు. తమ కూటమి పార్టీ అయిన ఎన్‌ఆర్ కాంగ్రెస్ తరపున సీఎం రంగసామి అన్ని నియోజకవర్గాల్లోనూ ముమ్మర ప్రచారం చేయాల్సి వచ్చిందన్నారు. అలాగే బీజేపీ తరపున స్వయంగా ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు ప్రచార బరిలోకి దిగారని గుర్తు చేశారు.


