తమిళసినిమా: హిప్ హాప్ ఆది ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన మీసై మురుక్కు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దానికి సీక్వెల్‌గా మీసై మురు క్కు– 2 వస్తున్న విషయం తెలిసిందే. హిప్ హాప్ ఆది కథానాయకుడిగా నటిస్తూ కథ ,దర్శకత్వం బాధ్యతలతో పాటూ సంగీతాన్ని అందిస్తున్న చిత్రం ఇది. కేతిక శర్మ, చైత్ర జె.ఆచార్ హీరోయిన్లుగా నటిస్తు న్న ఇందులో యోగిబాబు, కరుణాకరన్, హర్షద్ ఖాన్ ,నాజర్, రమ్య నాగ్ నాదన్, షార తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బెంచ్ మీడియా, అవ్ని మూవీస్ సంస్థల అధినేతలు ఏసీఎస్ అరుణ్ కుమార్ , నటి కుష్బూ సుందర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ సుబ్రమణియమ్, మాదేశ్ మాణిక్యం ద్వయం ఛాయాగ్రహణంను అందిస్తున్నారు. కాగా చిత్ర టైటిల్, టీజర్, ఫస్ట్ పోస్టర్లను ఇప్పటికే విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని నటుడు హిప్ హాప్ ఆది పేర్కొన్నారు. కాగా తాజాగా చిత్రంలోని ఆర పట్టుపత్తు అనే పాటను విడుదల చేసినట్లు, ఇది అంతర్జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అవుతుందని, యూట్యూబ్ ఛానళ్లలో ఇప్పటికే 100 మిలియన్ల ఫాలోవర్స్‌ను అధిగమించిందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ తాను ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ చిత్రంలోని పప్పాలి ఫళమే, గోవిందమ్మ అనే పల్లవిలతో సాగే పాటలకు సంగీత ప్రియుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు హిప్ హాప్ ఆది పేర్కొన్నారు.
మీసైమురుక్కు –2
చిత్రంలో హిప్ హాప్ ఆది, కేతిక శర్మ
బాహుబలి పెద్ద ప్రయత్నం
తమిళసినిమా: తమన్నా భాటియాను నటిగా గర్వపడేలా చేసింది బాహుబలి చిత్రం. అప్పటి వరకు ఆటా పాటలతో అందాల ప్రదర్శనలతో నటిగా కొనసాగిన ఈ బ్యూటీలోని అద్భుతమైన నటనను బాహ్య ప్రపంచానికి తెలియజేసిన చిత్రం బాహుబలి. ఆ చిత్రంలో వీరోచిత నారీ అవంతికగా తమన్న జీవించారనే చెప్పాలి. ఈ చిత్రం గురించి ఈ భామ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ‘‘ గత కాలాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటుంటే బాహుబలి చిత్రానికి తీసుకున్న ప్రతి నిర్ణయం సరైనదేనని అనిపిస్తోంది. అప్పట్లో ఒక ప్రాంతీయ భాషా చిత్రాన్ని రూ. 200 కోట్లు ఖర్చు పెట్టి రూపొందించడం అన్నది ఒక ప్రమాదకరమైన ప్రయత్నంగానే భావించారు. కారణం ఒకవేళ చిత్రం వ్యాపార పరంగా అటూ ఇటూ అయితే అందులోంచి బయటపడటం అనేది సాధారణ విషయం కాదు. భారీ నష్టం వాటిల్లేది. దర్శకుడు రాజమౌళి దూరదృష్టి, ఏ విషయంలోనూ రాజీపడని తత్వం, ధృఢమైన నమ్మకమే బాహుబలి చిత్రాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది. చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. బాహుబలి రెండు భాగాలు వ్యాపార పరంగా అత్యధిక వసూళ్లు సాధించాయి. అంతే కాకుండా చిత్ర పరిశ్రమలో, దర్శక నిర్మాతల్లో నమ్మకాన్ని కలిగించాయి. ఆ తరువాత పలు ప్రాంతీయ భాషా చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో రూపొంది విజయాలను అందుకుంటున్నాయి‘‘ అని తమన్నా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో విశాల్‌కు జంటగా మకుటం చిత్రంతో పాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.


