సాక్షి, చైన్నె : తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు, నూతన సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై విరుదా చలం నియోజకవర్గ ఎమ్మెల్యే, డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం విరుదాచలం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందే తాను ఒక విషయం స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారు. తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం వస్తే దానిని స్వాగతిస్తామని డీఎంకే కూడా గతంలో పేర్కొందన్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు అయితే వచ్చిందన్నారు. కానీ, ఇది ప్రజలకు మేలు చేసే ఆరోగ్యకరమైన మార్పుగా ఉండాలిలన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి ఒంటరిగా పూర్తి మెజారిటీ లేనందువల్లే, మద్దతు ఇస్తున్న కూటమి భాగస్వామ్య పక్షాల అందరికీ మంత్రి పదవులు పంచుతున్నారని పేర్కొన్నారు.
మేమూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతాం
– మంత్రి అరుణ్‌రాజ్ స్పష్టీకరణ
అన్నానగర్: తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి అరుణ్‌రాజ్ బుధవారం చైన్నెలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. అనంతరం మంత్రి అరుణ్ రాజ్ విలేకరులతో మాట్లాడుతూ.... ‘‘మేం ఆరోగ్య సంరక్షణ రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి విజయ్‌తో సంప్రదించాం. ఆ సమయంలో, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, సాధారణ రోగులకు ఉత్తమమైన చికిత్స అందించాలని ఆయన మాకు సలహా ఇచ్చారు. ప్రజలు చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే లక్షల రూపాయలు ఖర్చవుతుంది. కానీ ప్రభుత్వ ఆసుపత్రులలో, అన్ని రకాల నాణ్యమైన చికిత్సలు, మందులు ఎటువంటి ఆంక్షలు లేకుండా పూర్తిగా ఉచితంగా అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులలోని మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేవన్న ఆరోపణను నేను కాదనడం లేదు. మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచడానికి మేము తక్షణ చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ శాఖనే మేం నమ్మకపోతే, ఇంకెవరు నమ్ముతారు? మేం కూడా చ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రులలోనే చికిత్స పొందుతాం’’ అని పేర్కొన్నారు.
చైన్నె పోలీస్ కమిషనర్‌గా అమల్‌రాజ్
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజధాని చైన్నె నగర పోలీస్ విభాగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. చైన్నె గ్రేటర్ పోలీస్ నూతన కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎ. అమల్‌రాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో, పరిపాలనా, శాంతిభద్రతల సమీక్షలో భాగంగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఇందులో అత్యంత కీలకమైన చైన్నె సిటీ పోలీస్ కమిషనర్ బాధ్యతలను ప్రభుత్వం అమల్‌రాజ్‌కు అప్పగించింది. ఎ. అమల్‌రాజ్ తమిళనాడు క్యాడర్‌కు చెందిన అత్యంత సమర్థుడైన సీనియర్ ఐపీఎస్ అధికారి. గతంలో ఆయన రాష్ట్రంలోని పలు ముఖ్య జిల్లాలకు పోలీస్ సూపరింటెండెంట్ గా, కీలక నగరాలకు కమిషనర్‌గా సేవలు అందించారు చైన్నె కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన తిరుచ్చి, కోయంబత్తూర్ నగరాల పోలీస్ కమిషనర్‌గా, అడిషనల్ డీజీపీ క్యాడర్‌లో వివిధ కీలక విభాగాలలో పనిచేశారు. కాగా, ఎన్నికల సమయంలో చైన్నె పోలీసు కమిషనర్‌గా ఉన్న అరుణ్‌ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో అదనపు డీజీపీ హోదాలో ఉన్న అభిన్ దినేష్ మోదక్‌ను నియమించారు. ప్రస్తుతం ఆయన్ను తప్పించి గ్రేటర్ చైన్నె కమిషనర్‌గా అమల్ రాజ్‌కు బాధ్యతలు అప్పగించారు.
త్రిభాషా విధానాన్ని ఆమోదించవద్దు
– ముఖ్యమంత్రి విజయ్‌కి వైగో విజ్ఞప్తి
కొరుక్కుపేట: ప్రధాని నరేంద్రమోదీ చేసిన త్రిబాషా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమోదించకూడదని సీఎం విజయ్‌కి ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి 1965లో భాషా విప్లవంగా చెలరేగింది. సింగతమిళన్ చిన్నస్వామి, ఆరంగనాథన్, రచయిత వీరప్పన్, కీరనూర్ ముత్తు, సత్యమంగళం ముత్తు, విరాలిమలై షణ్ముగం, మయిలాడుదురై సారంగ పాణి, పీలమేడు దండ పాణి హిందీని ఎదిరించి ప్రాణాలర్పించారు. ఈనేపథ్యంలో తాజాగా మోదీ ప్రభుత్వం పీఎంశ్రీ పథకం ద్వారా తమిళనాడులో త్రిభాషా విధానాన్ని, హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తోంది. దీన్ని ఎన్నటికీ అంగీకరించకూడదు అని ఆయన సీఎంకి సూచించారు.


