మద్రాస్‌ హైకోర్టుకు.. 19 మంది కొత్త జడ్జిలు | - | Sakshi
Sakshi News home page

మద్రాస్‌ హైకోర్టుకు.. 19 మంది కొత్త జడ్జిలు

May 20 2026 1:46 AM | Updated on May 20 2026 1:46 AM

● సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం

సాక్షి, చైన్నె: మద్రాస్‌ హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడం కోసం మొత్తం 19 మంది పేర్లను సిఫార్సు చేస్తూ కొలీజియం తన ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం మద్రాస్‌ హైకోర్టులో మొత్తం 75 న్యాయమూర్తుల పోస్టులకు గాను 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా గత ఏడాది 2025 అటు న్యాయమూర్తుల కోటా నుండి, ఇటు న్యాయవాదుల కోటా నుండి పలువురి పేర్లను సిఫార్సు చేయడం జరిగింది.

జాబితాలకు కొలీజియం ఆమోదం..

సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపిన 19 మంది జాబితాలో 9 మంది జిల్లా కోర్టు న్యాయమూర్తులు, 10 మంది సీనియర్‌ న్యాయవాదులు ఉన్నారు. న్యాయమూర్తుల కోటా నుండి మద్రాస్‌ హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్‌ ఎస్‌. అల్లితో పాటు జిల్లా న్యాయమూర్తులుగా పనిచేస్తున్న మురుగన్‌, సుమతి, తిరుమగళ్‌ చంద్రశేఖర్‌, ధర్మలింగం లింగేశ్వరన్‌, కార్తికేయన్‌ బాలతాండాయుధం, షణ్ముగం కార్తికేయన్‌, బాలుచామి మురుగేశన్‌, గుణశేఖరన్‌ పేర్లు ఉన్నాయి. అలాగే న్యాయవాదుల కోటా నుండిప్రముఖ న్యాయవాదులు ఎన్‌. రమేష్‌, జి.కె. ముత్తుకుమార్‌, రాజేష్‌ వివేకానందన్‌, శంకరనారాయణన్‌ రవికుమార్‌, నాగరాజన్‌ దిలీప్‌కుమార్‌, ఇ. మనోహరన్‌, కృష్ణ స్వామి గోవిందరాజన్‌, రజినీష్‌ పదియిల్‌, కె. అప్పాదురై, ఆర్‌. అనిత ఉన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించిన ఈ 19 మంది జాబితాను తదుపరి నియామక ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ దీనికి ఆమోదం తెలిపిన తర్వాత, భారత రాష్ట్రపతి నూతన న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను (గెజిట్‌ నోటిఫికేషన్‌) జారీ చేస్తారు. ఈ నియామకాలు పూర్తయితే మద్రాస్‌ హైకోర్టులో న్యాయమూర్తుల కొరత దాదాపుగా తీరనుంది.

హైకోర్టు

Advertisement
 
Advertisement
Advertisement