విజయ్‌ నాకు సమకాలికులు కారు! | - | Sakshi
Sakshi News home page

విజయ్‌ నాకు సమకాలికులు కారు!

May 18 2026 6:57 AM | Updated on May 18 2026 6:57 AM

ఆయన ప్రభుత్వానికి రెండేళ్లు సమయం ఇవ్వాలి నేనెందుకు అసూయ పడాలి స్టాలిన్‌ నాకు మిత్రుడు రజినీకాంత్‌ వ్యాఖ్యలు

సాక్షి, చైన్నె : ఎన్నికల ఫలితాల అనంతరం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో తన భేటీ చర్చకు దారితీయడంతో రజినీకాంత్‌ వివరణ ఇచ్చారు. ‘‘స్టాలిన్‌కు, నాకు మధ్య ఉన్న బంధం రాజకీయాలకు అతీతమైంది. ఆయన నాకు సుదీర్ఘకాలంగా మంచి మిత్రుడు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. అయితే కొలత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్‌ ఓడిపోవడం నన్ను ఎంతగానో బాధించింది. ఒక మంచి స్నేహితుడిగా, ఆయనకు ధైర్యం చెప్పడానికే నేను వెళ్లాను‘ అని వివరించారు. విజయ్‌ సీఎం కాకూడదని, ఆయనను అడ్డుకోవడానికే రెండు పెద్ద పార్టీలు కలవాలంటూ తాను అక్కడ మాట్లాడినట్లు వస్తున్న వార్తలను రజినీ తీవ్రంగా ఖండించారు. అటువంటి దిగజారుడు రాజకీయాలు మాట్లాడే వ్యక్తిని తాను కాదన్నారు.

విజయ్‌కు రజినీకాంత్‌ శుభాకాంక్షలు చెప్పలేదని, ఆయనపై రజనీకి అసూయ ఉందంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సూపర్‌ స్టార్‌ ఘాటుగా స్పందించారు. ‘విజయ్‌ గెలవగానే నా ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌) ఖాతా ద్వారా అభినందనలు తెలిపానని గుర్తు చేశారు. ఇటీవల ఎయిర్‌పోర్టులో ఒకరు ఫోన్‌ చూపిస్తూ విజయ్‌ సీఎం అయ్యారు అని చెబితే, నవ్వుతూ వెళ్లిపోయానని, దాన్ని పట్టుకుని శుభాకాంక్షలు చెప్పలేదనడం సరికాదన్నారు.

సినిమా రంగం నుంచి వచ్చి ఒంటరి పోరాటంతో విజయ్‌ సాధించిన విజయాన్ని రజినీకాంత్‌ ఆకాశానికెత్తారు. చాలా చిన్న వయసులోనే విజయ్‌ ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌ వంటి మహానుభావులు సాధించిన రికార్డుల కంటే విజయ్‌ సాధించిన ఘనత చాలా పెద్దది. ఇది తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఒక ఒంటరి వ్యక్తిగా, పెద్ద పెద్ద పార్టీలను ఎదిరించి ఆయన విజయం సాధించారు. ప్రజలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఓటేశారని, కచ్చితంగా ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటారనే నమ్మకం తనకు ఉందన్నారు.

అభిమానులకు, కార్యకర్తలకు రజినీ పలు సూచనలు చేశారు. తాను ఎందుకు రాజకీయాల్లోకి రాలేదో గతంలోనే సుదీర్ఘమైన ప్రకటన ద్వారా స్పష్టం చేశానని గుర్తుచేశారు. ‘సినిమాలో నష్టం వస్తే కేవలం నిర్మాత మాత్రమే నష్టపోతాడని పేర్కొన్నారు. అయితే, రాజకీయం అలా కాదు.. దాని బాధ్యత చాలా పెద్దది. కమల్‌ హాసన్‌తో సహా సినిమా ప్రముఖులు చాలా మంది విజయ్‌ను కలిశారు. నేను కేవలం ఫార్మాలిటీ కోసం వెళ్లి కలిసే వ్యక్తిని కాను అని పేర్కొన్నారు.

విజయ్‌ పాలనను నిరూపించుకోవడానికి ప్రజలు కనీసం రెండేళ్ల సమయం ఇవ్వాలని కోరారు. విజయ్‌ పార్టీ కార్యకర్తలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, వారు చేసే చిన్న తప్పు కూడా విజయ్‌ ప్రతిష్టను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. తమిళనాడులో 60 ఏళ్ల తర్వాత సినిమా గ్లామర్‌, యువత, మహిళల మద్దతుతో ఒక పెను మార్పు వచ్చిందని రజినీకాంత్‌ ముగించారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తనపై వస్తున్న విమర్శలకు, రాజకీయ ఊహాగానాలకు సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ఆదివారం గట్టి కౌంటర్‌ ఇచ్చారు. పోయేస్‌ గార్డెనన్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్‌ను తాను కలవడం వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూనే, కొత్తగా సీఎం పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్‌పై తనకు ఎలాంటి అసూయ లేదని రజినీకాంత్‌ స్పష్టం చేశారు.

నాకు, విజయ్‌కు జనరేషన్‌ గ్యాప్‌

‘నేను రాజకీయాల్లోనే లేను.. అలాంటప్పుడు విజయ్‌పై నాకు ఎందుకు అసూయ ఉంటుంది? ఒకవేళ కమల్‌ హాసన్‌ సీఎం అయినా నాకు ఆ భావన రాదు. నాకూ, విజయ్‌కు మధ్య ఒక తరం వ్యత్యాసం ఉంది. చిన్నప్పటి నుంచి అతడిని చూస్తున్నాను. అతను సీఎం అవ్వడం నాకెందుకు అసూయ?‘ అని ప్రశ్నించారు.

అభిమానులకు సూచన

ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌ రికార్డులను మించిన ఘనత

రెండేళ్లు సమయం ఇవ్వాలి

విజయ్‌ విజయం అద్భుతం..

Advertisement
 
Advertisement
Advertisement