– ఆదాయ వనరుపై ప్రభుత్వం దృష్టి
సాక్షి, చైన్నె : తమిళనాడులో అధికార మార్పిడి అనంతరం ఇసుక క్వారీల నిర్వహణలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గత కొంతకాలంగా సాగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట పడటంతో, ఖనిజ వనరుల శాఖ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పెంచేందుకు సీఎం విజయ్ సిద్ధమయ్యారు.
రాజకీయ జోక్యం.. ప్రభుత్వానికి నష్టం
తమిళనాడు వ్యాప్తంగా నిర్మాణ రంగానికి ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా గ్రావెల్ మట్టికి ఎప్పుడూ కొరత ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని గతంలో మెజారిటీ క్వారీలను రాజకీయ నాయకులే నడిపించేవారు. ఆన్‌లైన్ ద్వారా అనుమతులు జారీ చేయడం, డ్రోన్ల ద్వారా తవ్వకాలను పర్యవేక్షించడం వంటి చర్యలు ప్రభుత్వం చేపట్టినప్పటికీ.. నాటి అధికార పార్టీ నేతల జోక్యంతో అక్రమాలు యథేచ్ఛగా సాగాయి. అనుమతి పొందిన పరిమితి కంటే ఎక్కువ తవ్వకాలు జరపడం, ఒక చోట అనుమతి తీసుకుని మరోచోట మట్టిని తరలించడం వంటి చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది.
మామూళ్ల దందాకు ముగింపు
గతంలో 6 యూనిట్ల (30 టన్నులు) మట్టిని తరలించడానికి ప్రభుత్వానికి ఆన్‌లైన్ ద్వారా రూ. 2,500 చెల్లించాల్సి ఉండేది. అయితే దీనితో పాటు కంపెనీ పేరుతో పైస్థాయి నేతలకు రూ. 2,400, స్థానిక నాయకులకు రూ. 1,200 చొప్పున మొత్తం రూ. 3,600 వరకు అక్రమ వసూళ్లకు పాల్పడేవారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అదనపు భారాన్ని తట్టుకోవడానికి, వ్యాపారులు ఆన్‌లైన్‌లో ఒకే ఒక్క ఒరిజినల్ పర్మిట్ తీసుకుని, దాని ఆధారంగా నకిలీ రశీదులను సృష్టించి పదే పదే మట్టిని తరలించేవారనిఇ సమాచారం. ఫలితంగా ప్రభుత్వానికి రావలసిన లక్షలాది రూపాయల ఆదాయంకు గండి కొట్టినట్లయ్యింది.
డ్రోన్ల నిఘా.. కఠిన చర్యలు
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ప్రకటన సమయం నుంచే అధికారుల నిఘా పెరగడంతో అక్రమ క్వారీలు మూతపడ్డాయి. అదే సమయంలో ప్రస్తుతం తమిళగ వెట్రి కళగం అధికారంలోకి రావడంతో, రాజకీయ నాయకులు అక్రమ క్వారీల జోలికి వెళ్లడం మానేశారు. ప్రస్తుతం పర్మిట్ల అవినీతికి పూర్తిగా ముగింపు పడే రీతిలో అధికారులు కొరడా ఝుళిపించి ఉన్నారు. దీంతో నిర్వాహకులు నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ పర్మిట్లు తీసుకునే పనిలో ఉన్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయం పుంజుకునే అవకాశాలు అధికమయ్యాయి. అలాగే ఖనిజ వనరుల శాఖ అధికారులు డ్రోన్ల సహాయంతో తవ్వకాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అనుమతించిన పరిమాణం కంటే ఎక్కువ మట్టిని తీస్తే భారీ జరిమానాలు విధిస్తున్నారు. లీజు పొందిన స్థలాన్ని కాకుండా వేరే చోట తవ్వకాలు జరిపితే సదరు క్వారీలను తక్షణమే సీజ్ చేసే విధంగా ఉరకలు తీస్తుండటంతో ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం క్రమంగా పెరిగనున్నది. ఈ విషయంగా శివగంగై జిల్లా ఖనిజ వనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ.. ప్రస్తుతం శివగంగై జిల్లాలో అనుమతి పొందిన 16 క్వారీలు మాత్రమే నడుస్తున్నాయి. జిల్లాలో ఎలాంటి అక్రమ క్వారీలు లేవని. రవాణా చేసే వాహనాలు సక్రమంగా పర్మిట్లు కలిగి ఉన్నాయా లేదా అనే అంశంపై క్షేత్రస్థాయిలో నిరంతర నిఘా ఉంచాం అని తెలిపారు.


