తమిళసినిమా: ఇంతకు ముందు బాలతారలుగా రాణించిన పలువురు ఆ తరువాత కథానాయికలుగా పరిచయం అయ్యి ఉన్నత స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే. అదేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొట్టాచ్చి కూతురు మానసీ పలు విజయవంతమైన చిత్రాల్లో బాలతారగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా తాజాగా బాలతార మానసి హీరోయిన్‌గా పూ కాయ్ కని అనే చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రం ద్వారా కేసీపీ. మిథున్ చక్రవర్తి కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇంతకు ముందు అడియే వెళ్లళగి, ఏన్ ఎన్నై కాదలిచ్చా వంటి ఇండిపెండెంట్ ఆల్బమ్‌లలో నటించి గుర్తింపు పొందారన్నది గమనార్హం. అదే విధంగా టూలెట్ చిత్రం కథానాయకుడు సంతోష్ నంబిరాజన్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. దీనికి వెట్రివీరన్ మహాలింగం దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు అరుంబు మీసై కురుంబు పార్వై, వెన్నెలా వీడు, విసిరి వంటి చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. అదేవిధంగా ఈయన ఇటీవల దర్శకత్వం వహించిన సూట్‌కేస్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. తాజాగా పూర్తి నేటివిటితో రూపొందిస్తున్న చిత్రం పూ కాయ్ కని. ఇది 1986 ప్రాంతంలో జరిగే మూడు పరిమాణాల్లో సాగే విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. దీన్ని ఇంతకు ముందు సూట్‌కేస్ చిత్రానికి నిర్మాణ నిర్వహణ భాద్యతలను నిర్వహించిన రాజేశ్వరి వెట్రివీరన్ ఈ చిత్రాన్ని పళయనూర్ సందనం పతాకంపై నిర్మిస్తున్నారు. కాగా డబ్బింగ్ కళాకారుడిగా పలువురు నటులకు డబ్బింగ్ చెప్పిన దర్శకుడు వెట్రివీరన్ కొడుకు రాజు మహాలింగంతో పాటు కూత్తుపట్టరైలో శిక్షణ పొందిన పలువురు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కవితాత్మకంగా ఉన్న చిత్ర టైటిల్ మాదిరిగానే చిత్రం జనరంజకంగా ఉంటుంద ని దర్శకుడు తెలిపారు. కాగా ఈ చిత్రానికి పీజీ.ముత్తయ్య ఛాయాగ్రహణంను, ధన్‌రాజ్ మాణిక్యం సంగీతాన్ని అందిస్తున్నారు.


