తిరువొత్తియూరు: రాష్ట్రంలోని డెల్టా జిల్లాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. తిరుచ్చిలో 50 ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం అనేక జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. డెల్టా జిల్లాల్లో శనివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కుంభకోణంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కామరాజర్ రోడ్డులో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుచ్చిలో వరుసగా రెండో రోజు భారీ వర్షం పడింది. చత్రం బస్టాండ్ వంటి ప్రధాన ప్రాంతాల్లో నీరు నిలవడంతో రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లోని 50కి పైగా ఇళ్లలోకి నీరు చేరింది. తంజావూరు, నాగపట్నంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కుండపోత వర్షం కురిసింది. అలాగే ముసిరి, పెరంబలూరు, అరియలూరు ప్రాంతాల్లో కూడా బలమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. పెరంబలూరు జిల్లాలో వడగళ్ల వాన పడి వాతావరణం చల్లబడింది. రోడ్ల పక్కన ఉన్న పెద్ద పెద్ద చెట్లు వేళ్లతో సహా నేలకూలడంతో ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది .ఈ వర్షం కురువై (ఖరీఫ్) పంట సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


