సాక్షి, చైన్నె: ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేసే అతిపెద్ద సైలెంట్ కిల్లర్స్‌లో రక్తపోటు మొదటి స్థానంలో ఉందని, ఈఅధిక రక్తపోటుపై ప్రజల్లో అవగాహన పెంచడం, సరైన పద్ధతిలో బీపీని కొలవడం , సమర్థవంతమైన నివారణా చర్యల ప్రాధాన్యతను వివరించడం లక్ష్యంగా చైన్నెలో ఆదివారం సదస్స జరిగింది. ప్రపంచ హైపర్‌టెన్షన్ దినోత్సవం సందర్భంగడా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వరల్డ్ హైపర్‌టెన్షన్ లీగ్ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్.ఎన్. నరసింగన్ నేతృత్వంలో చైన్నెలో ఒక రోజు అంతా ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ మొదట మూడు సార్లు బీపీ రీడింగ్స్ తీసుకుని పరీక్షలు చేశారు.
అవగాహన సదస్సు.. ప్రతిజ్ఞ
అనంతరం అధిక రక్తపోటు వల్ల కలిగే గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, పక్షవాతం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. దీనిని ఎలా నియంత్రించాలో వివరించిన తర్వాత, హాజరైన వారందరితో కలిసి ఒక సంతకాల ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వరల్డ్ హైపర్‌టెన్షన్ లీగ్ ఒంటరిగా కాకుండా భారత్‌లోని ప్రముఖ వైద్య సంస్థలతో కలిసి నిర్వహించింది. ఇండియన్ సొసైటీ ఆఫ్ హైపర్‌టెన్షన్ (తమిళనాడు చాప్టర్) తరఫున చైర్మన్ డాక్టర్ కె. కన్నన్, సెక్రటరీ డాక్టర్ ఎస్. చంద్రశేఖర్ , అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా (చైన్నె చాప్టర్) తరఫున హానరరీ జనరల్ సెక్రటరీ డాక్టర్ విజయ్ విశ్వనాథన్ ఈ సదస్సులో భాగస్వాములుగా వ్యవహరించారు. హైపర్‌టెన్షన్ మేనేజ్‌మెంట్‌లో వచ్చిన సరికొత్త అంతర్జాతీయ మార్గదర్శకాలు , క్లినికల్ అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. నగరంలోని ప్రముఖ కార్డియాలజిస్టులు (గుండె వైద్య నిపుణులు), నెఫ్రాలజిస్టులు (కిడ్నీ నిపుణులు), మరియు న్యూరాలజిస్టులు (నరాల వైద్య నిపుణులు) ఈ చర్చా వేదికలో పాల్గొన్నారు.


