మంత్రి సమీక్షకు ఆరుగురు ఎమ్మెల్యేల డుమ్మా | - | Sakshi
Sakshi News home page

మంత్రి సమీక్షకు ఆరుగురు ఎమ్మెల్యేల డుమ్మా

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

● టీవీకే ఎమ్మెల్యేలు సైతం గైర్హాజరు

సాక్షి, చైన్నె : తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లాలో అధికార పక్షానికి చెందిన మంత్రి నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షకు ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఇందులో టీవీకే ఎమ్మెల్యేలు కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది.

జిల్లా కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష

శివకాశి నియోజకవర్గం నుంచి తమిళగ వెట్రి కళగం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన కీర్తన, ఇటీవల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆమె విరుదునగర్‌ జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సుగపుత్ర, ఇతర ఉన్నతాధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. శనివారం సాయంత్రం నుంచి పొద్దుపోయే వరకు జిల్లా కలెక్టరేట్‌లో అన్ని శాఖల అధికారులతో మంత్రి కీర్తన అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్‌ సుగపుత్రతో పాటు జిల్లా ఎస్పీ శ్రీనాథ్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఆనంది సహా పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు తమ శాఖల వారీగా అమలవుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి వివరాలను మంత్రి కీర్తనకు వివరించారు.

ఆరుగురు డుమ్మా

ఈ కీలక సమావేశానికి హాజరు కావాల్సిందిగా విరుదునగర్‌, శ్రీవిల్లిపుత్తూరు, రాజపాళయం నియోజకవర్గాల టీవీకే ఎమ్మెల్యేలకు.. అలాగే అరుప్పుకోట్టై, తిరుచ్చుళి, సాత్తూరు నియోజకవర్గాల డీఎంకే ఎమ్మెల్యేలకు మంత్రి కార్యాలయం, జిల్లా యంత్రాంగం ముందస్తుగానే ఆహ్వానాలు పంపింది. అయితే, ఈ అధికారిక సమీక్షా సమావేశానికి జిల్లాకు చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరు కాకపోవడం గమనార్హం. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటూ ప్రతి పక్ష ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశాన్ని బహిష్కరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. టీవీకే జిల్లా కార్యదర్శి, విరుదునగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సెల్వం సమీక్షకే కాకుండా, మంత్రికి ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమానికి కూడా గైర్హాజరు కావడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement