కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరసన | - | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరసన

May 17 2026 12:48 AM | Updated on May 17 2026 12:48 AM

సాక్షి, చైన్నె: సీబీఐ డైరెక్టర్‌ పదవీ కాలాన్ని పొడిగించడం, నీట్‌ పరీక్షల నిర్వహణలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో శనివారం చైన్నెలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వపెరుంతొగై కేంద్ర ప్రభుత్వం వరుసగా ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలకు పాల్పడుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించడాన్ని తప్పుబడుతూ, అలాగే నీట్‌ పరీక్షను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలే ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునేందుకు అనుమతి నిరాకరిస్తున్న కేంద్రాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా చైన్నెలోని తండయార్‌పేట పోస్టాఫీస్‌ సమీపంలో భారీఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వపెరుంతొగై నాయకత్వంలో జరిగిన ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెల్వ పెరుంతొగై మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం నిరంతరం చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతోందన్నారు.. సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌కు పదే పదే పదవీ కాలం పొడిగించడం ఏ రకమైన న్యాయం?, దేశానికి ఏది మంచిదో అది చేయండి అని పార్లమెంట్‌ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ నిరంతరం కేంద్రానికి సూచిస్తున్నారని పేర్కొన్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం వీటిని చెవికెక్కించుకోవడం లేదని పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. ఇక డీఎంకే కూటమి పార్టీలైన ద్రవిడ కళగం తదితర పార్టీలు సైతం రాష్ట్రంలో పలు చోట్ల నీట్‌కు వ్యతిరేకంగా ఆందోలన కార్యక్రమాలను నిర్వహించాయి.

Advertisement
 
Advertisement
Advertisement