18న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
శాఖల కేటాయింపులో జాప్యం
సాక్షి, చైన్నె: పుదుచ్చేరి అసెంబ్లీ ప్రోటెం స్పీకర్‌గా అన్నాడీఎంకే ఎమ్మెల్యే అన్భళగన్ ఎంపికయ్యారు. ఈనెల 18వ తేదిన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్‌డీఏ కూటమి 18 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మే 13న ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటుగా ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ, కీలక శాఖల కేటాయింపుపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో నమశ్శివాయం, మల్లాడికృష్ణారావు ఉన్నారు.వీరికి శాఖల కేటాయింపు అన్నది ఇంకా జరగలేదు. ఇందుకు కారణం కీలక శాఖలపై గురి పెట్టడమే. అదే సమయంలో స్పీకర్ (సభాపతి) పదవి కోసం పోటీ నెలకొంది. ఈ పదవిని ఎన్‌ఆర్ కాంగ్రెస్‌కు చెందిన మాజీ స్పీకర్ శివకొలుందు లేదా మాజీ మంత్రి తిరుమురుగన్‌లలో ఒకరికి ఇవ్వాలని సీఎం రంగస్వామి భావిస్తున్నారు. అయితే, బీజేపీ తమ పార్టీకి చెందిన జి.ఎన్.ఎస్. రాజశేఖరన్‌కు ఇవ్వాలని పట్టుబడుతోంది. అలాగే, ఎన్నికల్లో ఓడిపోయిన వారికి నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులు ఇవ్వాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా, ఎన్నికల్లో పోటీ చేయని వారికి మాత్రమే ఆ పదవులు ఇవ్వాలని సీఎం రంగస్వామి స్పష్టం చేశారు. ఈ పరిస్థితులలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం సిద్ధం చేశారు. ఈనెల 18వ తేదీన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందు కోసం ప్రోటెం స్పీకర్‌గా అన్నాడీఎంకే ఎమ్మెల్యే అన్భళగన్ నియమితులయ్యారు.
పుదుచ్చేరి అసెంబ్లీ


