తిరువొత్తియూరు: తమిళనాడు, మధురై జిల్లా మేలూరు సమీపంలో ఉన్న కళ్లంద్రి గ్రామంలో శతాబ్దాల నాటి సంప్రదాయ చేపల వేట ఉత్సవం ఘనంగా జరిగింది. మధురై జిల్లాలోని తిరువదనూర్, వెల్లరిపట్టి, మేలవళవు వంటి వివిధ గ్రామాల్లో ఏటా ఈ సంప్రదాయ ఉత్సవం జరుగుతుంది. కళ్లంద్రిలోని చెరువు వద్ద ఈ ఏడాది వేడుకలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, వ్యవసాయం పచ్చగా సాగాలని కోరుకుంటూ గ్రామస్తులు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. రైతులు ఏటా ఈ చెరువులో చేప పిల్లలను వదులుతారు.
పంట కోతలు ముగిసిన తర్వాత, వేసవిలో నీటిమట్టం తగ్గినప్పుడు పెరిగిన చేపలను పడతారు. గ్రామ పెద్దలు తెల్ల జెండా ఊపి అనుమతి ఇచ్చిన వెంటనే, వేలాది మంది ప్రజలు ఒకేసారి చెరువులోకి దిగి చేపలను పట్టారు. కులమతాలకు అతీతంగా సుమారు 18 గ్రామాలకు చెందిన ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇది సామాజిక సామరస్యానికి, ప్రకృతితో మమేకమవ్వడానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ వేటలో ప్రజలకు రోహు, కట్ల, జలేబి (తిలాపియా), వాలుగ వంటి వివిధ రకాల నాటు చేపలు దొరికాయి. కొందరు కిలోల కొద్దీ చేపలను పట్టుకుని సంతోషంగా ఇంటికి వెళ్లారు. ఈ ఉత్సవం ద్వారా దొరికిన చేపలను వండి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, అనంతరం అందరూ కలిసి భోజనం చేస్తారు.


