వృద్ధురాలి హత్య
తిరువళ్లూరు: వృద్ధురాలిని హత్య చేసి నగలను అపహరించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా సూరపట్టు తులకానత్తమ్మన్ ఆలయ వధికి చెందిన రిటైర్డ్ కేంఽద్ర ప్రభుత్వ ఉద్యోగి దామోదరన్. ఇతను రెండు సంవత్సరాల క్రితం మృతిచెందాడు. ఇతడి భార్య పొన్నమ్మాల్(70) ఒంటరిగా వుంటున్నారు. వీరికి ఆరుగురు కుమార్తెలు వుండగా వీరికి వివాహమై వేర్వేరు చోట్ల వుంటున్నారు. ఈ క్రమంలో పొన్నమ్మాల్ ఇంట్లో దారుణ హత్యకు గురై శవమై వున్నట్టు స్థానికులు ఐదవ కుమార్తె గజలక్ష్మికి స్తానికులు సమాచారం అందించారు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వచ్చిన గజలక్ష్మి పుదూరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి హత్యకు గురైనట్టు ప్రాథమికంగా నిర్ధారించి మృతదేహాన్ని శవపరిక్ష నిమిత్తం వైద్యశాలకు తరలించారు. మృతదేహంపై కత్తిపోట్లు, గాయాలు వున్నట్టు గుర్తించిన పోలీసులు హత్యగా నిర్ధారించి, అక్కడ వేలీముద్రలను సేకరించి పాతనేరస్తుల వేలిముద్రలతో పోల్చిచూశారు. వీటిలో చైన్నెకి చెందిన పళణి(48), కాశిమేడు గ్రామానికి చెందిన తులసీదాస్(51) ఇద్దరి వేలిముద్రలు ఒకటే కావడంతో వారిని నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో వృద్ధురాలిని నగల కోసం హత్య చేసినట్టు గుర్తించారు. అనంతరం ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.


