వేలూరు: నర్సింగ్ సిబ్బంది సేవాభావాన్ని కలిగి ఉండాలని సినీ నటుడు గోపినాథ్ అన్నారు. వేలూరు సమీపంలోని శ్రీపురం బంగారుగుడి పీఠాధిపతి శక్తిఅమ్మ ఆశీస్సులతో నడుస్తున్న నారాయణి ఆస్పత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, వంద కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయం కావడంతో అభినందన కార్యక్రమం ఆస్పత్రి డైరెక్టర్ బాలాజీ అధ్యక్షతన నిర్వహించారు. గోపినాథ్ మాట్లాడుతూ దేశంలో అన్ని సేవలకన్నా నర్సులు చేసే సేవ మరవరాదన్నారు. ప్రమాదంలో ఉన్న వారిని వైద్యుల కన్నా ముందుగా నర్సులే చూస్తారని వారితో ప్రేమతో మాట్లాడి వారికి అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు. నర్సులు ఈ వృత్తిని ఉద్యోగంగా చూడకుండా సేవాభావంతో చూడాలన్నారు. రోగుల పట్ల ప్రేమగా మాట్లాడడం వల్లనే వారికి సగం రోగం నయం అవుతుందన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో ప్రతిఒక్కరూ స్నేహపూర్వకంగా కుటుంబసభ్యుల తరహాలో చూడాలన్నారు. ప్రతి ఆస్పత్రిలోనూ నర్సుల సేవలు అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ నర్సుల దినోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం విశిష్ట సేవలు అందజేసిన నర్సులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం గోపినాథ్‌కు ఆస్పత్రి డైరెక్టర్ బాలాజీ జ్ఞాపికను అందజేసి సన్మానించారు. ఆస్పత్రి సిబ్బంది, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.


