తిరువళ్లూరు: ఆవడి, అంబత్తూరు వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి, మత్తుమాత్రలు విక్రయిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వారిని నుంచి 180 కిలోల గంజాయి, రెండువేల మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని జేపీ ఎస్టేట్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గరుని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. పోలీసుల విచారణలో పట్టుబడిన వ్యక్తులు అయపాక్కం ప్రాంతానికి చెందిన గాంధీ కుమారుడు ధయాళన్(21), శాంతకుమార్ కుమారుడు ఉదయప్రశాంత్(21), వేణుగోపాల్ కుమారుడు గోపాలకృష్ణన్(21)గా గుర్తించి వారిని అరెస్టు చేశారు. అనంతరం వారి నుంచి గంజాయి, మత్తుమాత్రలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన కారు, ద్విచక్ర వాహనాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు అంబత్తూరు ప్రాంతంలో వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పద వ్యక్తులు తిరుపతి కుమారుడు గోపి(19)తోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరి నుంచి సైతం గంజాయి, మత్తుమాత్రలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి రెండు ప్రాంతాల్లో 180 కిలోల గంజాయి, రెండు వేల మాత్రలను స్వాధీనం చేసుకుని పలు వాహనాలను సీజ్ చేశారు.


