తమిళసినిమా: హీరోయిన్లు అందరూ ఒకేలా ఉండరు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అదే విధంగా ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం. ఎవరి భావాలు వారివి. అదేవిధంగా ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి వారిలో నటి త్రిష రూటే సపరేట్ అని చెప్పక తప్పదు. ఎప్పుడూ ఏదో సంఘటనతో ట్రెండింగ్‌లో ఉంటారీ బ్యూటీ. ఇటీవల ఒకటి రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో రకరకాల ట్రోలింగ్‌లకు గురయ్యారు. ఆ తరువాత రాజకీయాల్లో సెంట్రిక్ పాయింట్‌గా మారారు. సినిమాకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు ప్రచారం వైరల్ అయ్యింది. అలాంటిది తాజాగా త్రిష కథానాయకిగా బిజీ అవుతున్నారు. ఇకపోతే ఈ సంచలన నటి సూర్యకు జంటగా నటించిన కరుప్పు చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం పలు ఆటంకాలను ఎదురొడ్డి ఒక్క రోజు ఆలస్యంగా అంటే గురువారం తెరపైకి రావలసిన ఈ చిత్రం శుక్రవారం థియేటర్లల్లోకి వచ్చింది. దీంతో సూర్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వారిని మరింత ఖుషీ పరిచేలా త్రిష చిత్రం విడుదలైన తొలిరోజు ప్రేక్షకుల మధ్య చూడడానికి చైన్నెలోని రోహిణి థియేటర్ వద్ద చిరునవ్వులు చిందిస్తూ ప్రత్యక్షం అయ్యారు. దీంతో అభిమానులు ఫిదా అవ్వడం, ఫొటోగ్రాఫర్లు ఆమె అభినయం భంగిమలను తమ కెమెరాల్లో బంధించడంలో మునిగిపోయారు. అలా త్రిష కరుప్పు చిత్ర ప్రచారంలో భాగం అయ్యారు. ఆమె ఇంతకుముందు కరుప్పు ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనని వెలితిని ఇలా తీర్చారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


