సాక్షి, చైన్నె : ఎలక్ట్రికల్ టెర్మినల్స్, కనెక్టర్లు, ఇంటర్‌కనెక్ట్ సొల్యూషన్‌న్స్‌లో ప్రసిద్ధి చెందిన తైవాన్ కంపెనీ కేఎస్ టెర్మినల్స్ చైన్నె శివారుల్లో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తిరువళ్లూరు జిల్లా పరిధిలోని కడంబత్తూరు యూనియన్ ఉలుందై గ్రామంలో భారీ ఉత్పత్తి కేంద్రాన్ని ఆ సంస్థ శుక్రవారం ప్రారంభించింది. ఈ కొత్త ప్లాంట్ ద్వారా కేఎస్ టెర్మినల్స్ ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ఎనర్జీ, పారిశ్రామిక రంగాలకు అవసరమైన అత్యాధునిక కనెక్టివిటీ పరిష్కారాలను అందించనుంది. ఇక్కడ ప్రధానంగా ఆటోమోటివ్ కనెక్టర్లు, ఈవీ చార్జింగ్ కనెక్టర్లు, బ్యాటరీ మోడ్యులర్ కనెక్టర్లు, కార్డ్ ఎండ్ టెర్మినల్స్, ఇన్సులేటెడ్ టెర్మినల్స్ తయారు చేయనున్నారు. ఆ సంస్థ సీఈఓ జోచెంగ్ మాట్లాడుతూ చైన్నె ఫెసిలిటీ ద్వారా ఆటోమోటివ్, పునరుత్పాదక ఇంధన రంగాల్లోని తయారీదారులకు తాము నమ్మకమైన స్థానిక భాగస్వామిగా ఉంటామన్నారు. భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా, స్థానికంగా ఉత్పత్తులపై దృష్టి పెట్టనున్నామన్నారు.


