సాక్షి, చైన్నె: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 2026–27 ఖరీఫ్ సీజన్ మద్దతు ధరలు రైతులకు తీవ్ర నిరాశ కలిగించాయని తమిళనాడు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి.ఎస్.మాసిలామణి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర నిర్ణయం రైతులను మోసం చేసేలా ఉందని ఆయన విమర్శించారు. గత 16 ఏళ్లుగా రైతులు పోరాడుతున్న ప్రధాన డిమాండ్ అయిన సాగు ఖర్చుపై 50 శాతం లాభం విధానాన్ని ఈసారి కూడా అమలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. వరి క్వింటాల్‌కు కేవలం రూ.72 మాత్రమే పెంచడం అన్యాయమన్నారు.
తాజా పెంపుతో సాధారణ రకం వరి క్వింటాల్ ధర రూ 2,441 గాను, సన్న రకం వరి ధర రూ. 2,461గా నిర్ణయించారని పేర్కొన్నారు. ఎం.ఎస్.స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు శాసీ్త్రయంగా ధరలను పునఃసమీక్షించి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
వర్ష సూచనతో రైతుల ఆందోళన
నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించే అవకాశాల నేపథ్యంలో అన్నదాతలో ఆనందం నెలకొన్నా, తాజాగా వేసిన పంట మేరకు వరి కొనుగోళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం అకాల వర్షాల నేపథ్యతంలో చేతికి అంది వచ్చిన వరి పంటను పరిరక్షించుకునే దిశగా అనేక జిల్లాలోని పలు గ్రామాల్లో వరి కోతలు పూర్తి చేసే పనిలో రైతులున్నారు. ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుతోంది. అయితే, కొనుగోళ్లు ఆలస్యం అన్న సమాచారంతో ఎక్కడ వరి బస్తాలు తడిసి ముద్దై పోతాయో అన్న ఆందోళన రైతులో పెరిగింది. తాజాగా చెంగల్పట్టు జిల్లావ్యాప్తంగా 171 ప్రత్యక్ష వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ, కొనుగోలు ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ వంతు కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధాన్యం వర్షానికి తడిసి పాడవకముందే ప్రభుత్వం స్పందించి, త్వరితగతిన అన్నికేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.


