● మహిళ అరెస్ట్
తిరువొత్తియూరు: సరదాగా గడుపుదామని ఇంటికి రప్పిస్తే చివరకు నగలు కాజేసింది వెళ్లిందిరా బాబూ అని ఓ వృద్ధుడు తేలుకుట్టిన దొంగలా గొల్లుమనాల్సి వచ్చింది. వివరాలు.. చైన్నెలోని నెర్కుండ్రం ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు తన కుమార్తెతో కలిసి నివసిస్తున్నాడు. వేసవి సెలవుల కారణంగా గత వారం ఆయన కుమార్తె ఊరికి వెళ్లింది. దీంతో ఒంటరిగా ఉన్న వృద్ధుడు తనకు పరిచయం ఉన్న అ న్నానగర్, శాంతి కాలనీకి చెందిన ఓ మహిళను తన ఇంటికి ఆహ్వానించి సాన్నిహిత్యంగా గడిపాడు. ఆ సమయంలో వృద్ధుడి దృష్టిని మళ్లించిన ఆ మహిళ బీరువాలోపి 6 సవర్ల బంగారు నగలను దొంగిలించి ఏమీ ఎరగనట్టు వెళ్లిపోయింది. గురువారం ఇంటికి తిరిగి వచ్చిన వృద్ధుడి కుమార్తె బీరువా తెరచిచూసింది. నగలు కనిపించకపోవడంతో తన తండ్రిని నిలదీసింది. ఇంటి పని కోసం ఒక మహిళను పిలిపించిన ట్లు చెప్పి ఆయన తప్పించుకోవాలని చూశారు. చివరకు కోయంబేడు పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నగలు చోరీ చేసిన మహిళను అరెస్టు చేశారు.
రాతియుగం నాటి
ఆయుధం లభ్యం!
కొరుక్కుపేట: చిదంబరం సమీపంలోని దక్షిణ పెన్నా నదిలో ఒక పురాతన రాతి ఆయుధం లభ్యమైంది. బన్రిటీ సమీపంలోని కందరకోట్టై దక్షిణ నదిని పురావస్తు శాస్త్రవేత్త ఇమ్మాన్యుయేల్, చారిత్రకవేత్తలు కనుగొన్నారు. అధికారి ప్రతాప్ అగర్వాల్ క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. నది దక్షిణ భాగంలో పాలియోలిథిక్ కాలం నాటి రాతి ఆయుధాన్ని కనుగొన్నారు. ఇది సుమారుగా 7.8 సెం.మీ పొడవు, 5.7 సెం.మీ వెడల్పు ఉందని ఇమ్మాన్యుయేల్ తెలిపారు. ఇది రాతి యుగానికి చెందిన పురాతన రాతి ఆయుధం, సుమారు 50 వేల సంవత్సరాల క్రితం నాటిదని వెల్లడించారు.
టీటీడీకి ఇన్నోవా విరాళం
తిరుమల: చైన్నెకి చెందిన పోసన ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ మగేష్‌సుందర్ శుక్రవారం టీటీడీకి రూ.40 లక్షల విలువచేసే టయోటా ఇన్నోవా హైక్రాస్ వీజెడ్ మోడల్ కారును విరాళంగా అందించారు. దాత శ్రీవారి ఆలయం ముందు కారుకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథంకు కారు తాళాలు అందజేశారు.


