అధికారం వద్దా! | - | Sakshi
Sakshi News home page

అధికారం వద్దా!

May 15 2026 10:14 AM | Updated on May 15 2026 10:14 AM

● ఉదయ నిధి సనాతన వివాదంపై శ్రీధర్‌ వేంబు

సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీలో సనాతన ధర్మం అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ వ్యవహారంపై ప్రముఖ ఐటీ సంస్థ జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వేంబు ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా స్పందిస్తూ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా డీఎంకే భవిష్యత్తులో అధికారంలోకి రాకుండా ఉదయనిధి స్వయంగా అడ్డుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. వివరాలు.. తమిళనాడు శాసనసభ స్పీకర్‌గా జె.సి.డి. ప్రభాకర్‌ ఎన్నికై న సందర్భంగా అభినందనలు తెలిపిన ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌, తన ప్రసంగం చివరలో.. ‘ప్రజలను విడదీసే సనాతనాన్ని కచ్చితంగా నిర్మూలించాలి‘ అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నేతలు నైనార్‌ నాగేంద్రన్‌, వానతీ శ్రీనివాసన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, కాంగ్రెస్‌ ఎంపీ క్రిస్టోఫర్‌ తిలక్‌ మద్దతు పలికారు. ఈ వివాదంపై శ్రీధర్‌ వేంబు తనదైన శైలిలో విశ్లేషించారు.

భాషా మాయాజాలం

సనాతనం అనే పదం తమిళ ప్రజల దైనందిన భాషలో అంతగా వాడకంలో లేదని, అందుకే ఉదయనిధి ఆ పదాన్ని పదేపదే వాడుతున్నారని వేంబు పేర్కొన్నారు. ఒకవేళ ఆయన ధర్మం లేదా అరమ్‌ అనే పదాలను విమర్శించి ఉంటే, ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చేదని అభిప్రాయపడ్డారు. హిందూ దేవుళ్లపై, ఆచారాలపై డీఎంకే నిరంతరం చేస్తున్న దాడుల వల్లే ఆ పార్టీపై వ్యతిరేకత పెరిగిందని విశ్లేషించారు. అన్నాడీఎంకే ఎప్పుడూ ఇలాంటి దాడులు చేయలేదని, అందుకే డీఎంకే వ్యతిరేక ఓట్లను వారు గతంలో సులభంగా పొందగలిగారని వివరించారు. ఈ ఎన్నికల్లో డీఎంకే భారీగా ఖర్చు చేసినా, బలమైన కూటమి ఉన్నా ఓడిపోవడానికి ఉదయనిధి వ్యాఖ్యలు ఒక కారణమని ఆయన అన్నారు. కొత్తగా వచ్చిన టీవీకే పార్టీకి కూటమి లేకపోయినా డీఎంకేను ఓడించగలిగిందని పేర్కొన్నారు. డీఎంకే మళ్లీ అధికారంలోకి రాకూడదని ఉదయనిధి స్టాలిన్‌ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టుందని వ్యాఖ్యలు చేశారు. ఆ నిత్యమైన సనాతన ధర్మమే ఆయన కోరికను నెరవేరుస్తుందని శ్రీధర్‌ వేంబు తన పోస్ట్‌ను ముగించారు.

Advertisement
 
Advertisement
Advertisement