తిరువళ్లూరు: పూందమల్లి నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని రావాలని పూందమల్లి ఎమ్మెల్యే కుట్టి అలియాస్ ప్రకాశం కలెక్టర్ ప్రతాప్‌కు విన్నవించారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ప్రతాప్‌ను పూందమల్లి ఎమ్మెల్యే ప్రకాశశం మర్యాదపూర్వకంగా గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో కలిశారు. అనంతరం పూందమల్లి నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో పెండింగ్‌లో వున్న ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని, నియోజకవర్గంలో వేర్వేరు ప్రాంతాల్లో రోడ్లు, వీధిధీపాలు, తాగునీటి సదుపాయంతో పాటు ఇతర సదుపాయాలను కల్పించాలని కోరారు. దాదాపు 15 ఏళ్ల నుంచి పెండింగ్‌లో వున్నసెవ్వాపేట, వేపంబట్టు రైల్వే బ్రిడ్జీ నిర్మాణపు పనులను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సూచించారు. కుత్తంబాక్కం బస్టాండును సైతం అందుబాటులోకి తేవాలని కోరారు. కాగా కలెక్టర్‌ను కలిసి వారిలో పలువురు టీవీకే నేతలు కార్యకర్తలు ఉన్నారు.


