అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా..! | - | Sakshi
Sakshi News home page

అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా..!

May 15 2026 10:14 AM | Updated on May 15 2026 10:14 AM

తమిళసినిమా: నటుడు సూర్య, త్రిష జంటగా నటించిన తాజా చిత్రం కరుప్పు. ఆర్జే బాలాజీ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌ ఆర్‌.ప్రభు నిర్మించారు. సాయి అభయంకర్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర టైటిల్‌ తో పాటూ ట్రైలర్‌ విడుదలై కరుప్పు పై ఆసక్తిని పెంచేశాయి. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని గురువారం (మే 14న) విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని థియేటర్‌లలో ఉదయం 9 గంటల ఆటను ప్రదర్శించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని కూడా ఇచ్చింది. అయితే నిర్ణయించిన ప్రకారం కరుప్పు చిత్రం గురువారం ఉదయం ఆటలే కాదు, మార్నింగ్‌ షో, మ్యాట్నీ షోలు కూడా థియేటర్లో పడలేదు. ఫైనాన్షియల్‌ సమస్య కారణంగా కరుప్పు చిత్రం విడుదలలో ఆలస్యం జరిగిందని నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభు ఇన్‌ స్ట్రాగామ్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీ కరుప్పు చిత్రాన్ని అనుకున్న ప్రకారం విడుదల చేయలేక పోయినందుకు చింతిస్తున్నట్లు ఓ ఆడియోను విడుదల చేసి కంటతడి పెట్టారు. కాగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నటుడు సూర్య రంగంలోకి దిగినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement