చైన్నె నుంచి
1600 ప్రత్యేక బస్సులు
కొరుక్కుపేట: సెలవుల సందర్భంగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. మే 14, 15, 16, 17 మంచి ముహూర్తాలు, సెలవు దినాల్లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైన్నె సెంట్రల్ బస్ టెర్మినల్ నడిపే రోజూవారి బస్సులకు అదనంగా ప్రత్యేక బస్సులను నడపాలని తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ నిర్ణయించింది. చైన్నె సెంట్రల్ బస్ టెర్మినల్ నుంచి గురువారం నుంచి తిరుచ్చి, కుంభకోణం, మదురై, తిరునెల్వేలి, నాగర్‌కోయిల్, కన్నూర్, తూత్తుకుడి, కోయంబత్తూరు, సేలం, ఈరోడ్, తిరుప్పూర్ ప్రాంతాలకు 80 బస్సులు నడపనున్నారు. శుక్రవారం 620, శనివారం 655 బస్సులు నడపనున్నారు. మాధవరం నుంచి 120 బస్సులు, తిరుప్పూర్, ఈరోడ్, బెంగళూరు, కోయంబత్తూరు, వివిధ ప్రదేశాల నుంచి 25 బస్సులు నడపనున్నారు.
మరణంలోనూ
వీడని బంధం
–భర్త మృతిని తట్టుకోలేక భార్య కూడా మృతి
కొరుక్కుపేట: భర్త మృతిని తట్టుకోలేక మనస్తాపం చెంది భార్య కూడా మృతిచెందింది. కల్లకురిచి జిల్లాలోని ఉలుందూరుపేట సమీపం కలత్తూరు గ్రామానికి చెందిన నంగూరన్ (67) అస్వస్థతకు గురై రెండు రోజుల క్రితం మృతిచెందారు. బుధవారం ఆయన బంధువులు భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆ సమయంలో, ఓదార్చడానికి వచ్చిన బంధువులను నంగూరన్ భార్య అంజలై (63)ను కౌగిలించుకుని ఏడుస్తుండగా ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ సమయంలో అకస్మాత్తుగా అంజలైకి గుండెపోటు వచ్చి స్పృహ కోల్పోయారు. దిగ్భ్రాంతికి గురైన బంధువులు వెంటనే ఆమెను సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే అంజలై మృతిచెందింది.
ట్యాంకులో మునిగి
ఇద్దరి మృతి
అన్నానగర్: నీటి ట్యాంకులో మునిగి ఇద్దరు బాలురు మృతిచెందారు. నాగై జిల్లాలోని సికల్ ప్రాంతానికి చెందిన కలైవానన్. ఇతని కుమారుడు ప్రవీణ్‌సాయి(4). అదేప్రాంతానికి చెందిన ఇతని బంధువు సామిదురై కుమారుడు పవన్‌న్‌సాయి (4). ఆ ఇద్దరు వేలన్‌కన్ని ప్రాంతంలో ఉంటున్న భారతీమోహన్ ఇంటికి వెళ్లారు. బుధవారం సాయంత్రం వీరిద్దరు ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. చాలా సేపటి వరకు వారిద్దరూ ఇంటికి తిరిగి రాలేదు. వారి కోసం వెతకగా, భారతీ మోహన్ ఇంటి సమీపంలో కొత్త ఇల్లు కడుతున్న ఒక వ్యక్తి ఇంట్లోని నీటి ట్యాంక్‌లో పడి ఆ ఇద్దరు మృతిచెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ అస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి
అవయవాలు దానం
అన్నానగర్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన యువకుడి అవయవాలను కుటుంసభ్యులు దానం చేశారు. తిరుప్పూర్ జిల్లాలోని ఉడుమలైపేట్టై ప్రాంతానికి చెందిన కరుప్పస్వామి (22). గత 10వ తేదీ బైక్‌లో వెళుతూ అదుపుతప్పి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. కరుప్పస్వామి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యిందని బుధవారం వైద్యులు తెలిపారు. దీంతో, కరుప్పస్వామి కుటుంబసభ్యులు అతని అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. అనంతరం, అతని కాలేయం, మూత్రపిండాన్ని కోయంబత్తూర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి, మరో మూత్రపిండాన్ని సేలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి దానం చేశారు.
మినీ బస్సు దగ్ధం
వేలూరు: నడిరోడ్డు ఓ మినీ బస్సు దగ్ధమైంది. వేలూరు సైదాపేటకు చెందిన మొయిద్దీన్. ఇతను పాత బస్సులను కొనుగోలు చేసి వాటిని ధ్వంసం చేసి అమ్ముతుంటాడు. ఈ నేపథ్యంలో కోవై నుంచి పాత మినీ బస్సును కొనుగోలు చేశాడు. ఈ బస్సును కాట్పాడికి చెందిన వినోద్‌కుమార్ క్రేన్ ద్వారా వేలూరుకు తీసుకొస్తున్నాడు. మినీబస్సు గురువారం ఉదయం 10 గంటల సమయంలో వేలూరు జిల్లా పొయిగై వద్ద వస్తుండగా మినీ బస్సులో పొగలు వచ్చి మంటలు చెలరేగాయి. వీటిని గమనించిన క్రేన్ డ్రైవర్ వినోద్‌కుమార్ క్రేన్‌ను నిలిపి వేసి అక్కడ నుంచి పరుగులు తీశాడు. అప్పటికే మంటలు చెలరేగడంతో విషయం తెలుసుకున్న వేలూరు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని గంట పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. పొగలు దట్టంగా వ్యాపించడంతో బెంగళూరు నుంచి చైన్నె వెళ్లే జాతీయ రహదారిలో వాహన రాకపోకలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సర్వీస్ రోడ్డుకు వాహనాలను మల్లించారు. గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది.


