– మంత్రి ఆధవ్
సాక్షి, చైన్నె : సీఎం విజయ్ ఆదేశాలతో ప్రజల ప్రాథమిక సవుస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందడుగు వేశామని మంత్రి ఆధవ్ అర్జున తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీవీకే ప్రభుత్వ కార్యాచరణను వివరించారు. సాధారణంగా ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడానికే ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. అయితే, తమ నాయకుడు, సీఎం విజయ్ మాత్రం అంతకంటే ముందే ప్రజల కనీస అవసరాలు, నియోజకవర్గాల సమస్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించారని తెలిపారు. ఇందులో భాగంగానే విల్లివాక్కం నియోజకవర్గంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. మహిళా భద్రత, డ్రగ్స్ రహిత రాష్ట్రమే తొలి లక్ష్యంగా చర్యలు విస్తృతం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, వారిని గుండా చట్టం కింద జైల్లో పెట్టాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే మద్యం దుకాణాలను మూసివేయాలని కచ్చితంగా ఆదేశించామన్నారు.
పోలీస్ స్టేషన్లలో 24 గంటల నిఘా
పోలీస్ స్టేషన్లకు వచ్చే సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా పారదర్శకతను పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. పోలీస్ స్టేషన్లలో 24 గంటలూ సీసీ కెమెరాలు పనిచేయాలని, స్టేషన్‌లో ఎవరు ఫిర్యాదు చేసినా దానిని వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించామన్నారు. తమ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని, జీరో కరప్షన్, జీరో కమిషన్ విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రకటలించారు. టీవీకే నేతలు, ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ ప్రభుత్వ టెండర్లలో జోక్యం చేసుకోకూడదని, ఎవరికీ సిఫార్సులు చేయకూడదని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. ప్రభుత్వ పనుల పురోగతిపై ప్రతి నెలా ’రివ్యూ మీటింగ్’ నిర్వహిస్తామని పేర్కొన్నారు. టాస్మాక్ ఆదాయం కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం అని మూసి వేస్తున్న మద్యం దుకాణాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉపాధి, విధులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.


