వేలూరు: వేలూరు జిల్లాలోని కేవీకుప్పం నియోజకవర్గానికి చెందిన టీవీకే ఎమ్మెల్యే తెండ్రల్‌కుమార్ తన బాధ్యతలు చేపట్టిన అనంతరం సొంత నియోజకవర్గానికి ప్రభుత్వ బస్సులో వచ్చిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేలూరు జిల్లా కేవీ కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీవీకే ఎమ్మెల్యేగా తెండ్రల్‌కుమార్ గెలుపొందారు. విజయం సాధించిన వెంటనే ఈనెల 4న సాయంత్రం కాల్‌ట్యాక్సీని బుక్ చేసుకొని చైన్నెకి చేరుకున్నారు. చైన్నెలోని టీవీకే కార్యాలయం నుంచి అసెంబ్లీ కూడా ఎమ్మెల్యేలకు కేటాయించిన ప్రభుత్వ బస్సులోనే వచ్చి వెళ్లేవారు. ఇది గమనించిన పలువురు ఇతని వద్ద ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇంటర్వ్యూలో తాను నిరుపేద కుటుంబానికి చెందిన వాడినని తనకు కారు లేదని ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంటనే కాల్ ట్యాక్సీలో చైన్నెకి వచ్చానని ప్రస్తుతం చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నానని తన నియోజక వర్గ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పి చెప్పుల వేసుకుంటానని తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. ఇదిలా ఉండగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈనెల 13వ తేదీన సాయంత్రం చైన్నె సచివాలయం నుంచి కాట్పాడికి రైలు మార్గంలో చేరుకొని అక్కడ నుంచి కేవీ కుప్పంలోని తన నియోజక వర్గానికి బస్సులో ప్రయాణం చేశారు. అయితే తనకు ఎటువంటి ఆస్తులు లేవని ప్రభుత్వ బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో రావడంతో అఽధికారులు, వివిధ పార్టీల నేతలు విచారణ జరిపారు. అయితే ఎన్నికల నామినేషన్ వేసిన సమయంలో తనకు రూ.2 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అందులో చూపించారు. అయితే ఇతని భార్య పేరుపై రూ.10 కోట్ల దాకా ఆస్తులు ఉన్నట్లు స్థానికులు చెప్పడం గమనార్హం.


