విశ్వాస పరీక్షలో అధికార, ప్రతిపక్షాల కౌంటర్లు | - | Sakshi
Sakshi News home page

విశ్వాస పరీక్షలో అధికార, ప్రతిపక్షాల కౌంటర్లు

May 14 2026 6:51 AM | Updated on May 14 2026 6:51 AM

● మెజారిటీ నిరూపించుకున్న విజయ్‌ ● కాంగ్రెస్‌, ఇతర మిత్రుల మద్దతు ● రీల్స్‌ పాలన కాదు.. రియల్‌ పాలన సాగించండి ● ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయ నిధి హితవు ● వ్యతిరేకంగా పళణి ఓటు... ఆదరించిన సీవీ షణ్ముగం శిబిరం ● కాసేపు సభలో ఉత్కంఠ ● మార్మోగిన స్టాలిన్‌ నామం

విజయ్‌కే గెలుపు..

విపక్షాలు, ప్రతి పక్షాల చర్చ, ప్రసంగ అనంతరం స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌ ఆరు డివిజన్లుగా ఓటింగ్‌కు చర్యలు తీసుకున్నారు. డీఎంకేతో పాటూ ఆ పార్టీ చిహ్నంలో గెలిచిన కూటమి ఎమ్మెల్యేలు, డీఎండీకే వాకౌట్‌ చేశారు. ఈ కూటమిలోని ఎండీఎంకే సభ్యుడు సభకు రాలేదు. దీంతో సభలో సంఖ్యా బలం 171కి చేరింది. ఈ ఆరు డివిజన్ల ఓటింగ్‌లో విజయ్‌ విశ్వాస పరీక్షకు మద్దతుగా 144 ఓట్లు పడ్డాయి. 22 మంది వ్యతిరేకంచగా, బీజేపీ, పీఎంకేలు తటస్థంగా వ్యవహరించాయి. విజయ్‌కు మద్దతుగా నిలిచిన వారిలో 25 మంది అన్నాడీఎంకేకు చెందిన సీవీ షణ్ముగం– ఎస్పీవేలుమణి శిబిరానికి చెందిన వారు కావడం గమనార్హం.

సాక్షి, చైన్నె: గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ విధించిన నిబంధన మేరకు.. సీఎం సీ జోసెఫ్‌ విజయ్‌ బుధవారం అసెంబ్లీలో బల నిరూపణ చేసుకున్నారు. ఉదయం స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌ నేతృత్వంలో సభ ప్రారంభం కాగానే, సీఎం జోసెఫ్‌ విజయ్‌ తన విశ్వాస పరీక్షకు సంబంధించిన తీర్మానం ప్రవేశ పెట్టారు. ఇందుకు సంబంధించి అన్ని పార్టీల మద్దతు కోరారు. అదే సమయంలో స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌ ఆయా పార్టీలకు మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సమయంలో వ్యాఖ్యల తూటాలు హోరెత్తాయి.

స్థిరమైన పాలన లక్ష్యంగా..

రాష్ట్రంలో స్థిరమైన లౌకిక పాలన అందించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత, కిళ్లీయూరు ఎమ్మెల్యే రాజేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, స్పష్టమైన మెజారిటీకి కొద్దిగా దూరంగా నిలిచిందన్నారు. ఈ తరుణంలో సీఎం విజయ్‌ కేవలం లౌకిక పార్టీల మద్దతును మాత్రమే కోరారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌తో పాటు కమ్యూనిస్ట్‌ పార్టీలు, వీసీకే , ఐయూఎంఎల్‌ వంటి లౌకిక పార్టీలు విజయ్‌ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అభినందనీయమన్నారు. తమ నాయకుడు రాహుల్‌ గాంధీ మార్గదర్శకత్వం మేరకు, తమిళనాడులో లౌకిక విలువల పరిరక్షణ కోసం, విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం ప్రసంగించిన వీసీకే శాసన సభా పక్ష నేత వన్నియరసు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఇందులో ప్రధానంగా డీఎంకే ప్రభుత్వ బృహత్తర పథకాలన్నీ కొనసాగాలని కోరారు. సీపీఎం చెల్లకుమార్‌, సీపీఐ తలి ఆర్‌ రామచంద్రన్‌, ఐయూఎంఎల్‌ ఏఎం షాజహాన్‌లు సైతం తమప్రసంగంలో గత ప్రభుత్వ బృహత్తర పథకాల అమలుకు విన్నవిస్తూ బయటి నుంచి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఇక, అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగం ఎమ్మెల్యే కామరాజ్‌ తన మద్దతును టీవీకేకు ప్రకటించారు. ఈ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త వివాదానికి దారి తీసినా ఆ తదుపరి స్పీకర్‌ సూచనతో ఆయన తగ్గారు.

పళణికి షాక్‌ : మద్దతు..వ్యతిరేకత

అసెంబ్లీలో అన్నాడీఎంకే తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళని స్వామి ప్రసంగిస్తూ, టీవీకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా వచ్చినప్పటికీ, రాష్ట్రంలోని 65 శాతం ఓటర్లు ఆ పార్టీకి ఓటు వేయలేదనే విషయాన్ని వివరించారు. తమ హయాంలో తీసుకొచ్చిన పథకాలను గుర్తు చేస్తూ, ప్రజలు తమ పార్టీకి చెందిన 47 మందిని గెలిపించారని గుర్తుచేశారు. ఈ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తామన్న ఆశ చూపించి తన వైపు తిప్పుకోవడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. ‘మిమ్మల్ని మీరు ’పరిశుద్ధ శక్తి’గా చెప్పుకుంటున్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసే చర్యలను ప్రోత్సహించకూడదని హితవు పలికారు. కాంగ్రెస్‌, కమ్యూనిస్ట్‌, వీసీకే పార్టీలు విజయ్‌ ప్రభుత్వానికి మద్దతుగా నిలవగా, ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే మాత్రం విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నట్టు ప్రకటించారు.అదే సమయంలో పళణి స్వామి తదుపరి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎస్పీ వేలుమణికి ప్రసంగించే అవకాశం స్పీకర్‌ కల్పించడం వివాదానికి దారి తీసింది. కాసేపు అన్నాడీఎంకేలోని పళణి శిబిరం, సీవీ షణ్ముగం– ఎస్పీ వేలుమణి శిబిరం ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం ముదరడంతో స్పీకర్‌ తన కుర్చీ నుంచి లేని నిలబడి మరీ అందరూ కూర్చోవాల్సిందేనని హెచ్చరించారు. దీంతో ఇరు పక్షాల ఎమ్మెల్యేలు శాంతించారు. అనంతరం ఎస్పీ వేలుమణి మాట్లాడుతూ, తనను ఐదవసారి గెలిపించిన తొండముత్తూరు ప్రజలకు కృతజ్ఞతలు. తాము పదవుల కోసం ఆశపడటం లేదని స్పష్టం చేశారు. 54 సంవత్సరాల చరిత్ర కలిగిన అన్నాడీఎంకే 30 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నట్టు వివరించారు. తమ మా పోరాటం ఎప్పుడూ డీఎంకేతోనే అని పేర్కొంటూ, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్‌ ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఈ ప్రకటనతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. అంతకుముందే ఎడప్పాడి పళనిస్వామి తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించగా, దానికి భిన్నంగా వేలుమణి మాట్లాడటం అన్నాడీఎంకేలో చీలికను స్పష్టం చేసింది. కాగా తన ఆజ్ఞలను ధిక్కరించి సభలో విజయ్‌కు మద్దతుగా వ్యవహరించిన 25 మంది ఎమ్మెల్యేలపై చర్యలకు పళణిస్వామి శిబిరం అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది.

ఇన్‌స్టా కాదు..రియల్‌ పాలన కావాలి: ఉదయ నిధి

తమిళనాడు శాసనసభలో జరిగిన విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత, డీఎంకే యువజననేత ఉదయనిధి స్టాలిన్‌ సీఎం విజయ్‌ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ప్రభుత్వం ప్రజల పూర్తి మద్దతుతో ఏర్పడింది కాదని, కేవలం రాజకీయ సమీకరణాల వలన మనుగడలో ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో 4.93 కోట్ల మంది ఓట్లు వేయ గా, టీవీకేకు కేవలం 1.72 కోట్లు మాత్రమే వచ్చిందన్నారు. అంటే దాదాపు 3.21 కోట్ల మంది (65 శాతం ప్రజలు) తమరిని తిరస్కరించారని ఎద్దేవా చేశారు. ఓటు వేసిన వారికి కూడా ప్రస్తుతం తమరిపై నమ్మకం సన్నగిళ్లుతున్నట్టు పేర్కొన్నారు. టీవీకే ప్రభుత్వం తన కాళ్ల మీద తాను నిలబడలేదని, డీఎంకే కూటమిలోని పార్టీల బయటి మద్దతుతోనే నడుస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి పాలన రాకూడదనే ఉద్దేశంతోనే వారు మద్దతు ఇస్తున్నారని గుర్తు చేశారు. ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఉదయనిధి ఆరోపించారు. మార్పు తెస్తామని చెప్పారని, ఇప్పుడు అది కేవలం మార్పిడి వలే కనిపిస్తున్నదన్నారు. కూవత్తూరు రాజకీయాలను మించి తమరు చేస్తున్న డ్రామాలు చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో అని ప్రజలు అనుమానిస్తున్నారని విమర్శించారు. సోషల్‌ మీడియాలో హడావుడి చేయడంపై మండిపడుతూ.. పాలన అనేది ఇన్‌స్ట్రాగామ్‌ రీల్స్‌ లాగా ఉండకూడదు, నిజమైన పాలనలా ఉండాలని, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని హితవు పలికారు. డీఎంకే హయాంలో అమలు చేసిన పథకాలను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ, ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ, ఈ విశ్వాస తీర్మానంలో పాల్గొనకుండా తాము వాకౌట్‌ చేయాలని నిర్ణయించామన్నారు.

ప్రత్యేక అధికారి నియమాకంపై వివాదం

తన పార్టీకి చెందిన అధికార ప్రతినిధి, జ్యోతిష్కుడైన రిక్కి రతన్‌ పండిట్‌ వెట్రి వేల్‌కు ప్రభుత్వ ఓఎస్‌డీ పదవి కేటాయించడాన్ని అసెంబ్లీలో డీఎండీకే సభ్యురాలైన ప్రేమలత విజయకాంత్‌ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. మద్దతు కోసం గుర్రపు పందెం తరహాలో పదువులు అంటూ బేరసారాలు జరిగినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొంటూ, పలు ప్రశ్నలను సంధించారు. మనిదనేయ జననాయగ కట్చి ఎమ్మెల్యే తమీమున్‌ అన్సారీ, మనిదనేయ మక్కల్‌ కట్చి ఎమ్మెల్యే జవహిరుల్లా సైతం ప్రత్యేక అధికారి నియామకంపై విమర్శల తూటాలను పేల్చారు. ఇక, పీఎంకే సభ్యురాలు సౌమ్య అన్బుమణి ప్రసంగిస్తూ టాస్మాక్‌ మద్యం దుకాణాల మూతను ఆహ్వానిస్తూ సంపూర్ణ మద్య నిషేధం దిశగా అడుగులు వేయాలని కోరుతూ కొన్ని డిమాండ్‌లు ప్రభుత్వం ముందు ఉంచారు.

విమర్శలకు ధీటుగా విజయ్‌ సమాధానం

విశ్వాస పరీక్షలో నెగ్గిన విజయ్‌ ప్రసంగిస్తూ, విమర్శలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఈ ప్రభుత్వాన్ని ఎవరైనా ’మైనారిటీ ప్రభుత్వం’ అని పిలిస్తే తాము దానికి సంతోషిస్తామని, ఎందుకంటే ఇది మైనారిటీ ప్రజల హక్కులను కాపాడే ప్రభుత్వమని ఆయన ఉద్ఘాటించారు. ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్లిన తమ ఓటు బ్యాంకు 34.92 శాతానికి చేరడం ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. ఈ ఒంటరి విప్లవం నేడు విజిల్‌ విప్లవంగా మారిందని, ఈ మూడు సంవత్సరాలలో తమకు 1.72 కోట్ల మంది మద్దతుగా నిలిచారని, ఈ ప్రజల ఆశయాలను నెరవేరుస్తాం అని హామీ ఇచ్చారు. పెరియార్‌, కామరాజర్‌, అంబేడ్కర్‌, వేలునాచియార్‌, అంజలై అమ్మాళ్‌ వంటి మహానుభావుల ఆదర్శాలతో ’మనఃసాక్షి ఉన్న ప్రజాస్వామ్యాన్ని అందిస్తామని విజయ్‌ హామీ ఇచ్చారు. సామాజిక న్యాయం, మతాతీత విధానాలే తమ ప్రభుత్వానికి పునాదులని చెప్పారు. ఆవేశంగా సమాధానాలు చెప్పే కంటే, ధైర్యంగా పనులు చేసి ఫలితాల ద్వారా తమ సమాధానం చెబుతామని, తమది అధికారం చూపించి బెదిరించే ప్రభుత్వం కాదన్నారు. అందరినీ ప్రేమతో కలుపుకుపోయే ప్రభుత్వం అని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement