క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

May 14 2026 6:45 AM | Updated on May 14 2026 6:45 AM

●ఒకరు అరెస్టు ●భార్య గొంతు నులిమి హత్య ●బ్యాంకు ఉద్యోగి ఉరి వేసుకుని ఆత్మహత్య

మిన్నంటిన జాతర సంబరం

పళ్ళిపట్టు: పొదటూరుపేటలో గంగమ్మ జాతర వేడుకలు సందర్భంగా మహిళలు అమ్మవారికి పొంగళ్లు పెట్టి దర్శించుకున్నారు. పళ్లిపట్టు సమీపంలోని పొదటూరుపేటలో చైత్ర మాసంలో గంగమ్మ జాతర వేడుకలు నిర్వహించడం పరిపాటి. శుక్రవారం ధ్వజారోహణంతో ప్రారంభమైన జాతర వేడుకల్లో భాగంగా మంగళవారం ఉదయం అమ్మవారికి విశేష అలంకరణ చేపట్టి మహాదీపారాదనణ పూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి అంబలి సమర్పించి ఆలయం వద్ద పొంగళ్లు పెట్టి అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయం వద్ద ఆధ్మాత్మిక కచ్చేరి నిర్వహించారు. బుధవారం సాయంత్రం అమ్మవారికి కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. గంగమ్మ జాతర వేడుకలు సందర్భంగా ఆలయం పరిసర ప్రాంతాలు విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తులకు ప్రసాదాలు అన్నదానం పంపిణీ చేశారు.

రైల్వేలో ఉద్యోగం పేరిట రూ.10.80 లక్షలు మోసం

తిరువళ్లూరు: రైల్వేలో నర్సింగ్‌ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ. 10.80 లక్షలు మోసం చేసిన వ్యవహరంలో యువకుడ్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పుట్లూరు గ్రామానికి చెందిన జయశీలన్‌ కుమార్తే జయప్రియ(24). ఈమె వద్ద చైన్నె తాంబరం ప్రాంతానికి చెందిన జగన్నాథన్‌ కుమారుడు రోహిత్‌ తనకు రైల్వేలో ఉన్నత అధికారి వద్ద పరిచయం వుందని తద్వారా రైల్వేలో నర్సింగ్‌ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.10.80 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అనంతరం జయప్రియకు నకిలీ ఉత్తర్వులను సైతం ఇచ్చాడు. అయితే ఆలస్యంగా మోసపోయామని భావించి ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రోహిత్‌(29)ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

మద్యం మత్తులో

భర్త దారుణం..

తిరువొత్తియూరు: కుటుంబ కలహాల కారణంగా ఏర్పడిన గొడవలో భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా ఆత్తూరుకు చెందిన మణికంఠన్‌ (37), అతని భార్య కృష్ణవేణి (23) కేరళలోని ఒత్తపాలయంలో అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. మణికంఠన్‌ తరచూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఈనెల 10వ తేదీ రాత్రి కూడా మణికంఠన్‌ మద్యం తాగి రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో మణికంఠన్‌ కృష్ణవేణి గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. మరుసటి రోజు ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన పొరుగువారు లోపలికి వెళ్లి చూడగా, కృష్ణవేణి మృతి చెంది ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోస్టుమార్టం పరీక్షలో ఆమె గొంతు నులిమి హత్యకు గురైనట్లు నిర్ధారణ అయ్యింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మణికంఠన్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

దేవాలయం మరుగుదొడ్డిలో..

తిరువొత్తియూరు: వండలూర్‌ సమీపంలోని ఎం.జి.ఆర్‌ నగర్‌కు చెందిన ప్రభాకరన్‌ (47) మధురాంతకంలోని ఓ బ్యాంకులో ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య మేనక, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రభాకరన్‌ రోజూ తన మోటార్‌ సైకిల్‌పై గుడువాంచేరి వరకు వెళ్లి, అక్కడ నుండి బస్సులో మధురాంతకం వెళ్లేవారు. బుధవారం ఉదయం కూడా ఎప్పటిలాగే బయలుదేరిన ఆయన, మార్గమధ్యంలో ఓ దేవాలయ ప్రాంగణంలో మరుగుదొడ్డిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసి స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement