కాన్స్‌ చిత్రోత్సవాల్లో డీసీ చిత్ర ట్రైలర్‌ | - | Sakshi
Sakshi News home page

కాన్స్‌ చిత్రోత్సవాల్లో డీసీ చిత్ర ట్రైలర్‌

May 14 2026 6:45 AM | Updated on May 14 2026 6:45 AM

తమిళసినిమా: మానగరం చిత్రంతో దర్శకుడిగా మారిన బ్యాంకు ఉద్యోగి లోకేష్‌ కనకరాజ్‌ అన్ని విషయం తెలిసిందే. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో లోకేష్‌ కనకరాజ్‌ జీవితమే మారిపోయింది. ఆ తరువాత కార్తీ హీరోగా ఖైదీ, విజయ్‌ కథానాయకుడిగా మాస్టర్‌, కమలహాసన్‌ హీరోగా విక్రమ్‌, వంటి భారీ చిత్రాలు చేసి స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగిపోయారు. అలాంటిది ఇటీవల రజనీకాంత్‌ హీరోగా చేసిన కూలీ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోవడంతో దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ పేరు బాగా దెబ్బతింది. దీంతో షారూఖ్‌ ఖాన్‌ హీరోగా చేయాల్సిన హిందీ చిత్రం ఆగిపోయింది. రజినీకాంత్‌, కమలహాసన్‌ కలిసి నిర్మించనున్న చిత్రం వేరే దర్శకుడి చేతిలోకి వెళ్లి పోయింది. అలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా చిత్రం చేసే అవకాశం రావడం లోకేష్‌ కనకరాజ్‌ కాస్త ఉపశమనం కలిగించిందనే చెప్పాలి. అయితే ఆ చిత్రం ప్రారంభం కావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్‌ కనకరాజ్‌ హీరోగా అవతారమెత్తి డీసీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటి వామికా కబి నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరుణ్‌ మాదేశ్వర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లోకేష్‌ కనకరాజ్‌ గ్యాంగ్‌ స్టర్‌ గా నటిస్తున్న ఇందులో నటి వామిక వేశ్య పాత్రలో నటిస్తున్న సమాచారం. కాగా అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇకపోతే చిత్ర ట్రైలర్‌ను ఈనెల 15వ తేదీన కాన్స్‌ చిత్రోత్సవాల్లో విడుదల చేయనున్నట్లు యూనిట్‌ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. చిత్రం త్వరలోనే తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement